ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో జిల్లా ముందంజ
సాకారమవుతున్న పేదల సొంతింటి కలలు
క్షేత్రస్థాయిలో స్పష్టమైన పురోగతి
-జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ నిరుపేదలకు నిలువ నీడ కల్పించాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో జనగాం జిల్లా రాష్ట్ర స్థాయిలో ముందంజలో నిలుస్తోందని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు.జిల్లాలో మంజూరైన ప్రతి ఇందిరమ్మ ఇల్లు వేగవంతంగా నిర్మాణ దశకు చేరేలా జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో,నేడు మంజూరైన ఇళ్లన్నీ వివిధ దశల్లో నిర్మాణంలో కొనసాగుతున్నాయన్నారు.ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలలో ఒకటైన ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు పక్కా కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని కలెక్టర్ పేర్కొన్నారు.అర్హులైన నిరుపేదలకు మాత్రమే లబ్ధి చేకూరేలా లబ్ధిదారుల ఎంపిక నుంచి ఇళ్ల నిర్మాణం వరకు ప్రభుత్వ మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేశామని తెలిపారు.మండలాల వారీగా మంజూరైన ఇళ్ల సంఖ్య,గ్రౌండింగ్ అయిన ఇళ్లు,నిర్మాణ దశలో ఉన్న ఇళ్ల వివరాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ,గ్రౌండింగ్ జరగని ఇళ్లపై ప్రత్యేక దృష్టి సారించడం ద్వారా లబ్ధిదారులచే పనులు ప్రారంభించేలా చర్యలు చేపట్టినట్లు చెప్పారు.ఫలితంగా రాష్ట్ర స్థాయిలో ఇళ్ల గ్రౌండింగ్లో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు.లక్ష్య సాధన కోసం మండల స్పెషల్ అధికారులు,తహసీల్దార్లు,సంబంధిత శాఖల అధికారులతో పాటు నిరంతరం క్షేత్రస్థాయి పరిశీలనలు నిర్వహించడంతో నిర్మాణాలు వేగవంతం అయ్యాయని తెలిపారు.అలాగే ఇందిరమ్మ కమిటీల సహకారం కూడా కీలకంగా దోహదపడిందన్నారు.జిల్లాలో రెండు విడతల్లో మొత్తం 5,834 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా,5,206 ఇళ్లు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయి,33 ఇళ్లు పూర్తయ్యాయి.ఇప్పటివరకు 4,499 మంది లబ్ధిదారులకు వివిధ దశల వారీగా ఆర్థిక సహాయం విడుదల చేసినట్లు తెలిపారు.ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకం ప్రతి గడపకు చేరేలా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తూ,వివిధ శాఖల సమన్వయంతో పాటు నిరంతర పర్యవేక్షణే ఈ విజయానికి ప్రధాన కారణమని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ స్పష్టం చేశారు.