
ముహమ్మద్ జావిద్ అహ్మద్ పాషా అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ ప్రజా సంబంధాల ప్రతినిధి ఆంధ్రప్రదేశ్
ఈ69న్యూస్ వరంగల్
పండుగలు మన జీవన స్రవంతిలో భాగమై మన జాతీయతకు,సంస్కృతి వికాసానికి దోహదం చేస్తాయి.అన్ని మతాల పండుగల వెనుక ఒక సందేశం దాగి ఉంటుంది.మానవాళికి హితాన్ని బోధిస్తాయి.ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు జరుపుకునే ప్రధాన పండుగల్లో ఈదుల్ ఫితర్ (రంజాన్)ఒకటి.ఈ పండుగకు అత్యంత ప్రాముఖ్యత ఉంది.ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం,సంవత్సరంలోని పన్నెండు నెలల్లో తొమ్మిదవ నెలగా ఉన్న రంజాన్ మాసంలో ముస్లింలు ఖురాన్ గ్రంథంలోని“ఓ విశ్వాసులారా మీరు ధార్మికులు కావాలనే ఉద్దేశంతో మీ కంటే పూర్వం ఉన్న వారికి విధింపబడినట్లే మీకు కూడా ఉపవాస నియమము విధించబడియున్నది.”అను ఈ సూక్తి ప్రకారం ముప్పయి రోజులు ఉపవాస దీక్షలు పాటించి,పదవ నెల అయిన షవ్వాల్ మొదటి తేదీన జరుపుకునే పండుగే ఈదుల్ ఫితర్.సాధారణంగా దీన్ని రంజాన్ పండుగ అని పిలుస్తారు.ముస్లింలు దీనిని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.దానికి ప్రధాన కారణం మ ‘దివ్య ఖురాన్’అనే ముస్లింల పవిత్ర గ్రంథం ఈ మాసంలో ప్రవక్త ముహమ్మద్ పై అవతరించిందని వారి విశ్వాసం. క్రమశిక్షణ,దాతృత్వం,ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసమని అంటారు.ఇది ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు జరుపుకునే ముఖ్యమైన పండుగ.చాంద్రమాన హిజ్రీ నెల తేదీలు స్థానికంగా చంద్రోదయంపై ఆధారపడివుండడంతో,స్థానిక ధార్మిక పండితులు నెలవంక కనిపించడంపై ఈ పండుగను ప్రకటిస్తారు.దాంతో,ఈద్-ఉల్-ఫితర్ ప్రాంతాలవారీగా వేర్వేరు రోజుల్లో జరుపుకుంటారు.మన దేశంలో ఈ సంవత్సరం ఈద్-ఉల్-ఫితర్ మార్చి 31,సోమవారం రోజున జరుపుకుంటున్నారు.ఈద్-ఉల్-ఫితర్ నాడు ప్రత్యేకమైన నమాజ్ చేస్తారు.సాధారణంగా బహిరంగ స్థలంలో కానీ,భారీ హాలులో కానీ,మసీదుల్లో ఈ ప్రార్థన చేస్తారు.ఈ ప్రార్థనను కేవలం సమూహంగానే చేస్తారు.అందరూ కలిసి అల్లాహ్ గొప్పదనాన్ని స్మరిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.ఈదుల్ ఫితర్ పండుగ మానవుల్లో అత్యున్నత మానవీయ విలువలను,పరస్పర ప్రేమానురాగాలను పెంపొందిస్తుంది.పరోపకార గుణాన్ని,సహనం,త్యాగం,కరుణ,సానుభూతి భావాలను సమాజంలో సమానత్వం,సోదరభావం,సామరస్య వాతావరణాన్ని సూచిస్తుంది.విశ్వ మానవ సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తుంది.అందరూ ఒకచోట గుమిగూడి రోజా ఉపవాసవ్రతం ఆచరించే మహాభాగ్యం కలిగి,మానవుల మార్గదర్శనం కోసం,సమాజంలో విలువల విస్తృతి కోసం పవిత్ర ఖురాన్ గ్రంథం అవతరింపజేసినందుకు దైవానికి కృతజ్ఞతలు సమర్పించుకుంటూ నమాజ్ చేస్తారు.తరువాత ఇమామ్ ఖురాన్,హదీసుల వెలుగులో ఆధ్యాత్మిక మార్గదర్శనం చేస్తారు.రంజాన్ నెలలో మరొక విశేషం అత్యధిక దానధర్మాలు చేయడం.సంపన్నులైనవారు రంజాన్ నెలలో జకాత్,ఫిత్రానా ఆచరించాలని ఖురాన్ బోధిస్తోంది.పేదవారు కూడా అందరితో పాటు పండుగను జరుపుకోవడానికి,సంతోషంలో పాలుపంచుకునేందుకు ఈ జకాత్ ఉపయోగపడుతుంది.జకాత్ తో పాటు ఫిత్రాదానానికి రంజాన్ నెలలో ఎంతో ప్రాముఖ్యత ఉంది.మూడు పూటల తిండికి,ఒంటినిండా బట్టకు నోచుకోని పేదవారు ఎంతో మంది ఉన్నారు.ఇలాంటి అభాగ్యులకు,పేదవారికి పండుగ సందర్భంగా దానం చేయాలని ఇస్లాం బోధిస్తుంది.దీనినే ఫిత్రాదానం అని పిలుస్తారు.ఉపవాస వ్రతాలు విజయవంతంగా ముగిసినందుకు దేవుడి పట్ల కృతజ్ఞతగా,పేదలకు ఈ ఫిత్రాదానం విధిగా అందజేస్తారు.ఫిత్రాదానంలో రెండు కిలోల గోధుమలను గానీ,దానికి సమానమైన ఇతర ఆహార ధాన్యాలను గానీ,దానికి సమానమైన ధనాన్ని గానీ పంచిపెట్టాలి.ఈ దానం కుటుంబంలోని సభ్యులందరి తరపున పేదలకు అందజేయాలి.దీనివల్ల సర్వపాపాలు క్షమించబడి,పుణ్యం దక్కుతుందనే నమ్మకం ఉంది.ముహమ్మద్ ప్రవక్త “ఎవరైతే భక్తి భావంతో రంజాన్ మాసాన్ని గడిపి,తన పాపాల నుండి విముక్తి కోరుతాడో,అతని గత పాపాలను అల్లాహ్ మన్నిస్తాడని బోధించారు.రంజాన్ ఉపవాసం కేవలం ఆహారం,నీరు మానడం మాత్రమే కాదు.ఇది మన మనస్సును,ప్రవర్తనను,ఆలోచనలను నియంత్రించుకోవడానికి ఒక సాధనంగా ఉపయోగపడుతుందని,ఉపవాసం కేవలం భౌతిక నియంత్రణ కాదు,ఉపవాసి అబద్ధం చెప్పకుండా,దుర్మార్గంగా ప్రవర్తించకుండా ఉండాలి.ఎవరైనా మీతో గొడవకు దిగితే ‘నేను ఉపవాసంలో ఉన్నాను’అని చెప్పాలని ప్రవక్త తెలిపారు.అదేవిధంగా ఉపవాస వ్రత నియమాన్ని పాటించే సమయంలో హృదయంలో కలిగే చెడు తలంపులు,ఆలోచనలు,నోటి నుంచి వెలువడే అసత్యాలు,పనికిమాలిన మాటలు వంటి పొరపాట్లు జరుగుతుండడం ఇలాంటి అనాలోచిత పొరపాట్లు అన్నీ ఫిత్రాదానం వల్ల క్షమించబడతాయని నమ్ముతారు.మానవుల మధ్య నెలకొన్న వర్గ వైషమ్యాలు తొలగించి అందరిలో ఆధ్యాత్మిక చింతన కలిగించి జీవితాన్ని ఆనందంతో నింపి పుణ్య కార్యాల వైపు దృష్టి మరల్చే రంజాన్ మాసం,చైతన్యాన్ని కలిగించి ముందుకు సాగే ధైర్యాన్ని ఇస్తుంది.ఈ పండుగను పేద,ధనిక తేడా లేకుండా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు.ప్రతి ఒక్కరూ స్తోమతకు తగ్గ కొత్త బట్టలు ధరించి,పండుగ నమాజును మసీదుల్లో,ఊరి బయట నిర్ణీత ప్రదేశాలైన ఈద్గాహ్ లలో చేస్తారు.అనంతరం ఒకరికొకరు”ఈద్ ముబారక్”(శుభాకాంక్షలు) చెప్పుకుంటారు.ముస్లిం ప్రజలు తమ కోసం,తమ కుటుంబం కోసం,బంధుమిత్రుల కోసం,తమ దేశం కోసం,దేశవాసుల సుఖసంతోషాల కోసం,ప్రపంచ శాంతి,సౌభాగ్యాల కోసం అల్లాహ్ ను వేడుకుంటారు.అనంతరం పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ,అభివాదాలు,ఆలింగనాలు చేసుకుంటూ తమ మనసులోని ఆనందాన్ని పంచుకుంటారు.పండుగకు ప్రత్యేకంగా తయారు చేసిన సేమియాలను తమ హిందూ,ముస్లిం,క్రైస్తవ,సిక్కు వివిధ ధర్మాలకు చెందిన సోదరులందరికీ రుచి చూపించి తమ ఆనందాన్ని వారితో పంచుకుంటారు.కనుక,రంజాన్ స్ఫూర్తిని నిరంతరం కొనసాగించాలి.నెలరోజుల ఉపవాస ప్రభావం భవిష్యత్తు జీవితంలో ప్రతిఫలించాలి.మళ్లీ రంజాన్ వరకు ఈ తీపి అనుభూతులు మిగిలి ఉండాలి.అల్లాహ్ సమస్త మానవాళినీ సన్మార్గపథంలో నడిపించాలని,భూమిపై శాంతి వర్ధిల్లాలని,ప్రపంచమంతా సుఖసంతోషాలతో,సుభిక్షంగా ఉండాలని మనసారా కోరుకుంటూ…అందరికీ ఈద్ ముబారక్!-వ్యాస రచన కర్త:-
ముహమ్మద్ జావిద్ అహ్మద్ పాషా అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ ప్రజా సంబంధాల ప్రతినిధి ఆంధ్రప్రదేశ్