ఎమ్మెల్యే గండ్ర సత్తన్నపై మంత్రి తుమ్మల ప్రశంసల జల్లు
ప్రజల మధ్యే ఉంటూ అభివృద్ధిని ముందుకు నడిపిస్తున్న నాయకుడు
•పాతఇస్సీపేట వేదికగా ఎమ్మెల్యే పనితీరును కొనియాడిన రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భూపాలపల్లి నియోజకవర్గంలో ప్రజలతో నిత్యం మమేకమై, గ్రామగ్రామాన అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు (సత్తన్న) పనితీరును రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బహిరంగంగా ప్రశంసించారు.మొగుళ్ళపల్లి మండలం పాతఇస్సీపేట గ్రామంలో నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి,ఎమ్మెల్యే గండ్రను అభినందనలతో ముంచెత్తారు.ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ,భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్తన్న తనను ఒక్క గోడౌన్ శంకుస్థాపనకు పిలిచి పరిమితం కాలేదని,నియోజకవర్గానికి అవసరమైన మరిన్ని గోడౌన్లు, సహకార సంఘాలు (సొసైటీలు), మౌలిక వసతుల అభివృద్ధి పనులు కావాలని స్పష్టంగా కోరారని తెలిపారు. ప్రజల అవసరాలను ముందుగానే అంచనా వేసి, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, నిధులు తీసుకురావడంలో గండ్ర సత్తన్న ముందుంటారని కొనియాడారు.భూపాలపల్లి నియోజకవర్గంలో ప్రతీ గ్రామాన్ని, ప్రతీ గడపను చేరిన రాష్ట్రంలోనే అరుదైన ఎమ్మెల్యే గండ్ర సత్తన్న అని పేర్కొన్న మంత్రి, తాను ఆయనను పరిచయం అయినప్పటి నుంచి నిరంతరం గమనిస్తున్నానని తెలిపారు. ఎన్నికల కాలంలో మాత్రమే కాదు, ఎన్నికలు లేని సమయంలో కూడా ప్రజల్లో ఉంటూ సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కారానికి కృషి చేసే నాయకుడు గండ్ర సత్తన్న అని అన్నారు.మంత్రి తుమ్మల ఇంకా మాట్లాడుతూ,“రాజకీయాలు అంటే పదవులు, అధికారం కాదు. ప్రజల కోసం కష్టపడి పనిచేయాలనే నిజమైన తపన ఉండాలి. ఆ తపన, నిక్కచ్చితనం గండ్ర సత్తన్నలో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజా ప్రతినిధిగా ఉండాల్సిన లక్షణాలన్నీ ఆయనలో ఉన్నాయి” అంటూ ఎమ్మెల్యే గండ్రను ప్రశంసించారు.అలాగే భూపాలపల్లి నియోజకవర్గంలో జరిగిన గ్రామసభలు, పాదయాత్రలు, బస్తీ బాటలు, సంక్షేమ కార్యక్రమాల అమలు, అభివృద్ధి పనుల పర్యవేక్షణ వంటి అంశాల్లో గండ్ర సత్తన్న పాత్ర కీలకమని మంత్రి పేర్కొన్నారు. ప్రజలకు ప్రభుత్వం చేరువయ్యేలా చేసిన నాయకుల్లో గండ్ర సత్తన్న ముందువరుసలో ఉన్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, స్థానిక సంస్థల ప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మంత్రి స్థాయి నాయకుడు బహిరంగంగా ఎమ్మెల్యే పనితీరును ప్రశంసించడం భూపాలపల్లి రాజకీయ వర్గాల్లో విశేష చర్చకు దారి తీసింది