ఐద్వా 14వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి
జిల్లా అధ్యక్షురాలు ఇర్రి అహల్య పిలుపు
జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం ఇప్పగూడెం గ్రామంలో అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) 14వ జాతీయ మహాసభల సందర్భంగా జెండా,వాల్‌పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఐద్వా జనగామ జిల్లా అధ్యక్షురాలు ఇర్రి అహల్య ముఖ్య అతిథిగా హాజరై జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ఐద్వా 14వ జాతీయ మహాసభలు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో 2026 జనవరి 25 నుంచి 28 వరకు నాలుగు రోజులపాటు జరుగుతాయని తెలిపారు.జనవరి 25న భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.దేశవ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ఈ మహాసభల్లో విస్తృత చర్చ జరిపి,భవిష్యత్ మహిళా ఉద్యమానికి దిశానిర్దేశం చేయనున్నట్లు అన్నారు.కేంద్రంలో ఎన్డీఏ-బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలపై హింస,హత్యలు,అత్యాచారాలు పెరిగాయని ఆరోపించారు.మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న బీజేపీ మంత్రులు బాధితుల పక్షాన నిలవక,నిందితులను సమర్థించడం దుర్మార్గమని విమర్శించారు.మనువాద ఆలోచనలతో మహిళా హక్కులను కాలరాస్తూ,ప్రజాస్వామ్యాన్ని అణిచివేసే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు.మైనార్టీలు,దళితులపై దాడులు పెరుగుతున్నాయని,విద్యా-వైద్య రంగాలు సామాన్యులకు అందుబాటులో లేకుండా మారాయని తెలిపారు.భ్రూణహత్యలు పెరిగి,స్త్రీ-పురుషనిష్పత్తి క్షీణిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.నిరుద్యోగం,పని భద్రత లేకపోవడం,మైక్రో ఫైనాన్స్ సంస్థలు-ప్రైవేట్ బ్యాంకుల వేధింపులతో మహిళలు ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితి ఏర్పడిందన్నారు.మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని,నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో మహిళల జీవనం కష్టంగా మారిందని పేర్కొన్నారు.రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకోవాలంటే మహిళలు సంఘటితంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.తెలంగాణ పోరాటాల గడ్డ అని,చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం,ఆరుట్ల కమలాదేవి వంటి వీరనారులు పుట్టిన నేలపై జాతీయ మహిళా మహాసభలు జరగడం గర్వకారణమని అన్నారు.జనవరి 25న జరిగే బహిరంగ సభకు మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బోళ్ల పార్వతమ్మ (ఫస్ట్ వార్డ్ మెంబర్),మంద లావణ్య,మంద కవిత,మంద పద్మ,ఎర్రి కవిత,పోలాస రాజమ్మ,ఎన్.రెడ్డి సుజాత,ఆరుట్ల రజిత,నర్సమ్మ,పిట్టల యాదమ్మ,హబీబా,దార్న మల్లికాంబ,రాధ తదితర మహిళలు పాల్గొన్నారు.