తెలుగు గళం న్యూస్ హన్మకొండ/ఐనవోలు
హన్మకొండ జిల్లా ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో ఒగ్గు పూజారి చేసిన అక్రమ వసూళ్ల ఘటన భక్తుల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది.ఆలయంలో అధికారికంగా రూ.300 టికెట్ తీసుకున్న ఓ భక్తుడిని,పూజ నిర్వహణ పేరుతో మరో రూ.700 అదనంగా ఇవ్వాలని ఒగ్గు పూజారి డిమాండ్ చేసినట్టు ఆరోపణలు వెలువడ్డాయి.అదనపు డబ్బులు ఇవ్వలేదన్న కారణంతో పూజను మధ్యలోనే నిలిపివేసిన ఘటన కలకలం రేపింది.ఈ ఘటనతో ఆలయానికి వచ్చిన భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ,తమ ఆధ్యాత్మిక భావాలను దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు.బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవగా,ఆలయ ప్రతిష్ఠకు భంగం కలిగిందని పలువురు పేర్కొన్నారు.ఈ విషయంపై ఆలయ ఈవో సుధాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.భక్తుల నుంచి అదనపు డబ్బులు వసూలు చేయడం,ఇవ్వలేదని పూజను ఆపేయడం తీవ్ర తప్పిదమని పేర్కొంటూ,ఒగ్గు పూజారి రాజేశ్‌ను తక్షణమే సస్పెండ్ చేసినట్టు ప్రకటించారు.సస్పెండ్ చేసిన పూజారి ఇకపై విధుల్లోకి రావొద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.ఒగ్గు పూజారులు సంప్రదాయంగా ఆలయంలో పట్నాలు వేస్తూ వస్తున్నప్పటికీ,భక్తులను బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడటం ఏమాత్రం సహించబోమని ఈవో హెచ్చరించారు.భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని,ఆలయంలో పూజా విధానాలు పూర్తిగా పారదర్శకంగా సాగేందుకు చర్యలు చేపడతామని ఆలయ యాజమాన్యం స్పష్టం చేసింది.