ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం
రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.సోమవారం హైదరాబాదు నుండి ఇతర ఎన్నికల అధికారులతో కలిసి వీడియో సమావేశం ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు,జిల్లా కలెక్టర్లు,ఎన్నికల నమోదు అధికారులు,సహాయ ఎన్నికల నమోదు అధికారులతో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.ప్రత్యేక సాంద్రత పునఃపరిశీలన (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) దృష్ట్యా మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.పట్టణ ప్రాంతాల్లో రోజుకు కనీసం 10 వేల ఓటర్ల మ్యాపింగ్ చేపట్టి,నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.వచ్చే వారంలోగా మ్యాపింగ్ ప్రక్రియలో గణనీయమైన పురోగతి నమోదు కావాలని ఆదేశించారు.అలాగే ఓటర్ల జాబితాలో ఉన్న మసకబారిన ఫోటోలు,చిన్న పరిమాణ ఫోటోలు,సరైనవి కాని ఫోటోలను గుర్తించి,ఫారం-8 ద్వారా అసలైన ఫోటోలను సేకరించి జాబితాను నవీకరించాలని సూచించారు.ఈ మొత్తం ప్రక్రియను జనవరి 2026 లోగా పూర్తి చేయాలని తెలిపారు.ఈ వీడియో సమావేశంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్,అదనపు కలెక్టర్లు,రెవెన్యూ డివిజనల్ అధికారులు,తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.