కాంగ్రెస్ పార్టీ సర్పంచుల గెలుపు కోసం విస్తృత ప్రచారం
వర్ధన్నపేట మండల పరిధిలోని చెన్నారం, కాశగూడెం, ఉప్పరపల్లి, నల్లబెల్లి గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ఆయా గ్రామాలలో వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమూద్ ఆయుబ్ వరంగల్ అర్బన్ జిల్లా యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేఆర్ దిలీప్ రాజ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్బంగా ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ..
గ్రామం అభివృద్ధి చెందాలన్నా, గ్రామ సమస్యలు పరిష్కారం కావాలన్నా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను మాత్రమే గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఇంకా 3ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని, ఎమ్మెల్యే గా నేను ఉంటానని గ్రామాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుందామని తెలిపారు. ఇతర పార్టీ అభ్యర్థులు గెలిస్తే, ప్రభుత్వం దగ్గరకు, ఎమ్మెల్యే దగ్గరకు రాలేడని, గ్రామంలో ఏ రకమైన అభివృద్ధి పనులు చేసేందుకు అవకాశం ఉండదని కావున గ్రామ ప్రజలు గ్రామ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఓటు వేయాలని కోరారు. ఇతర పార్టీల అభ్యర్థులు ఇచ్చే మద్యం, డబ్బులకు ఆశ పడి, వాళ్ళు చెప్పే మాయ మాటలు నమ్మి వారికీ ఓటు వేస్తే గ్రామంలో జరగాల్సిన అభివృద్ధి ఆగిపోతుందని తెలిపారు. ఈ ఎన్నికలు గ్రామ అభివృద్ధికి సంబందించిన ఎన్నికలని మన గ్రామ అభివృద్ధి మన చేతుల్లోనే ఉందని కావున పని చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశంలోనే ఎక్కడా లేని అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. 25 లక్షల మంది రైతులకు 21వేల కోట్ల రుణ మాఫీ చేయడం, 9రోజుల్లో 9వేల కోట్లు రైతులకు పెట్టుబడి సాయం అందించడం ఒక చరిత్ర అని కొనియాడారు. సన్నాలకు 500రూపాయల బోనస్, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ వంటి పథకాలు అమలు చేస్తూ రైతులకు అండగా ప్రభుత్వం నిలబడుతుందని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహ అవసరాలకు 200యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న బియ్యం పంపిణి, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు వంటి ప్రజా సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. గ్రామాలలో ఇందిరమ్మ ఇల్లు రావాలన్నా, సిసి రోడ్లు నిర్మాణం కావాలన్నా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమాలలో ఆయా గ్రామాల సర్పంచ్, వార్డు అభ్యర్థులు, మండల నాయకులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.