
ఈ69 న్యూస్ జయశంకర్ భూపాలపల్లి రేగొండ
గత ప్రభుత్వంలో పాలకులు గురుకులాలను నిర్వీర్యం చేసి విద్యావ్యవస్థను భ్రష్టు పట్టించారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు విమ ర్శించారు.ఈ మేరకు శనివారం ఎమ్మెల్యే మండల కేంద్రంలోని కేజీబీవీ గురుకులాన్ని స్థానిక నాయకులతో కలిసి తనిఖీ చేశారు.విద్యార్థులను భోజనం, వసతి పై వివరాలు అడిగి తెలుసుకుని వారితో కలిసి భోజనం చేశారు. నాణ్యమైన విద్య, పోషకాలు కలిగిన భోజనాన్ని విద్యార్థులకు అందజేయాలని ఆదేశించారు.అనంతరం ఎమ్మెల్యే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో విద్యావ్యవస్థ పై పురోగతి సాధిస్తున్నామన్నారు.రాష్ట్రం లోని అన్ని వసతి గురుకులాల విద్యార్థుల డైట్, కాస్మెటిక్ చార్జీలను 200 శాతం పెంచిన ఘనత మా ప్రభుత్వానిదేనని అన్నారు.విద్యార్థులకు సన్న బియ్యంతో భోజనం, చలికాలంలో గీజర్లు, దుప్పట్ల తో మెరుగైన వసతులు కల్పిస్తున్నామన్నారు. మైలారం లో సమీకృత గురుకుల భవనాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్లు మంజూరు చేసిందని ఒక్కో భవనానికి రూ.28 కోట్ల చొప్పున 7 భవనాలను 18 నెలల్లో నిర్మించను న్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. బిఆర్ఎస్ నాయకులు ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉండి గురుకులాలను విజిట్ చేసి విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అవుతుందని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.ప్రతిపక్ష పార్టీగా సూచనలు ఇవ్వాలని సూచించారు.గురుకుల మౌలిక వసతుల కోసం రూ.13 లక్షలు మంజూరు చేశానని గతంలో కూడా గురుకుల అవసరాలకు రూ.10 లక్షలు ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.గురుకులంలో 240 మంది విద్యార్థులు ఉన్నారని వారి అవసరాలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో గురుకుల ప్రిన్సిపాల్ మనోరమ, భూపాలపల్లి వ్యవసాయ కమిటీ చైర్మన్ గుటోజు కిష్టయ్య, పిఎసిఎస్ చైర్మన్ నడిపెల్లి విజ్జన్ రావు, మండల అధ్యక్షుడు ఇప్ప కాయల నరసయ్య, టౌన్ అధ్యక్షుడు ఏనుగు రవీందర్ రెడ్డి, బుగులోని జాతర చైర్మన్ రొంటాల వెంకటస్వామి, కాంగ్రెస్ నాయకులు మోడెం ఉమేష్ గౌడ్, పున్నం రవి, మైస బిక్షపతి, మేకల బిక్షపతి, గండి తిరుపతి,తదితరులు పాల్గొన్నారు.