
ఈ69న్యూస్ జనగామ
గ్రామీణ జర్నలిస్టులకు వేతనాలు,కల్పించాల్సిన సౌకర్యాల సాధనకై
రాష్ట్రస్థాయిలో ఉద్యమం చేపట్టనున్నట్టు బిఎంఎస్ అనుబంధ వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షుడు తాడూరు కరుణాకర్,కార్యదర్శి శివనాద్రి ప్రమోద్ కుమార్తెలిపారు.శుక్రవారం జనగామ జిల్లా కేంద్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లా
డబ్ల్యూజేఐ కన్వీనర్ పులి శరత్ కుమార్ అధ్యక్షతన జరిగిన సన్నాహక కమిటీ సమావేశానికి హాజరయ్యారు.ఈ సందర్భంగా డబ్ల్యూజేఐ నేతలు మాట్లాడుతూ పత్రికా రంగానికి మూల స్తంభాల లాంటి
గ్రామీణ జర్నలిస్టులు యాజమాన్యాల వెట్టిచాకిరి కోరల్లో నలిగిపోతున్నారని ఆరోపించారు.అసంఘటిత రంగంలోని కార్మికులకు కనీస వేతనాలు,పనివేళలు,పీఎఫ్,ఈఎస్ఐ
లాంటి సదుపాయాలు ఉండగా,గ్రామీణ జర్నలిస్టులు ఈ సదుపాయాలకు నోచుకోలేకపోవడం శోచనీయమన్నారు.పత్రికా యాజమాన్యాలు గ్రామీణ జర్నలిస్టులను వ్యాపార వస్తువుగా మార్చి వేశాయని,ఆ పరిస్థితుల నుండి వారిని బయటపడేయాల్సిన జర్నలిస్టు సంఘాలు చోద్యం చూస్తూ వచ్చాయని విమర్శించారు.తెలంగాణలో 30 వేలకు పైగా గ్రామీణ జర్నలిస్టుల దుర్భర పరిస్థితులకు ఇంతకాలం వారికి ప్రాతినిధ్యం వహించిన సంఘాల వైఫల్యమే ప్రధాన కారణమని
ధ్వజమెత్తారు.విలేకరులకు నయా పైసా వేతనాలు చెల్లించకుండా పనులు చేయించుకుంటున్న పత్రికల యాజమాన్యాలు,దానికే పరిమితం కాకుండా వారిపై
ప్రకటనలు,పత్రికల చందాల పేరుతో అంతులేని భారం మోపుతున్నాయని అన్నారు.తెలంగాణ ఏర్పాటు అనంతరం జర్నలిజం వృత్తిలో పరిస్థితులు
మెరుగుపడడం మాట అటుంచి,మరింత దిగజారిపోయాయని తెలిపారు.గ్రామీణ ప్రాంతాలలో విలేకరులు,పట్టణ ప్రాంతాల్లో స్ప్రింగర్ల జీవితాలు మరింత దుర్భరంగామారిపోయాయన్నారు.2014 నుండి ఇప్పటివరకు రాష్ట్రంలో సంభవిస్తున్న జర్నలిస్టుల అకాల మరణాలే వారి పరిస్థితికి అద్దం పడుతున్నాయన్నారు.2014 జూన్ నుండి ఇప్పటివరకు
500 మందికి పైగా జర్నలిస్టులు
మరణించారని,ఇందులో అత్యధికం గుండెపోటుతో జరిగినవి కాగా,ఆ తర్వాతి స్థానాన్ని కరోనా కాలం ఆక్రమించిందన్నారు.ప్రమాదాలు,లివర్ సంబంధిత వ్యాధులతో మరణించిన జర్నలిస్టులు ఉన్నారని చెప్పారు.వృత్తిలో ఎదురవుతున్న తీవ్ర మానసిక ఒత్తిళ్ళే ఇందుకు ప్రధాన కారణమని,ఆర్థిక సమస్యలు కూడా
జర్నలిస్టుల మరణాలకు దోహదం చేస్తున్నాయని చెప్పారు.మీడియా సంస్థల యాజమాన్యాలు విలేకరులపై మోపుతున్న భారం వల్ల వారు తీవ్రంగా కుంగిపోతున్నారని,జిల్లా స్టాపర్లు మొదలుకొని
మండల స్థాయి విలేకరుల వరకు
సర్క్యులేషన్,అడ్వర్టైజ్మెంట్ల టార్గెట్లను నెరవేర్చాల్సి వస్తున్నదన్నారు.పండుగలు,సంస్థ వార్షికోత్సవాలు,క్యాలెండర్ల ముద్రణ పేరుతో యాజమాన్యాలు పెడుతున్న స్పెషల్ టార్గెట్లువిలేకరులపై మానసిక ఒత్తిడిని పెంచుతున్నాయని,వారిని ఆర్థికంగా,మానసికంగా,శారీరకంగా కుంగదీస్తున్నాయని తెలిపారు.ప్రభుత్వం ఇచ్చే అక్రిడిటేషన్ లను
కూడా కొన్ని సంస్థల యాజమాన్యాలు తమ చేతుల్లోకి తీసుకొని పాత బకాయిల వసుళ్ళ కోసం వాడుకుంటున్న పరిస్థితులు ఉన్నాయన్నారు.రాష్ట్రంలో ఒకటి,రెండు మినహా
మిగతా పత్రికలేవీ వేతన ఒప్పంద సిఫార్సులను అమలు చేయడం లేదని,వేజ్ బోర్డ్ వేతనాలు చెల్లించాల్సి వస్తుందన్న కారణంతో అనేక పత్రికలు విలేకరులకు ఎలాంటి గుర్తింపు కార్డులు ఇవ్వడం లేదని చెప్పారు.అనేక పత్రిక యాజమాన్యాలు న్యూస్ ఏజెన్సీల పేరిట సిబ్బందిని రిక్రూట్ చేసుకుంటున్నాయన్నారు.వేజ్ బోర్డు సిఫార్సులు అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అయిన దానిని పట్టించుకునే నాధుడే కరువయ్యారని వారు విమర్శించారు.వేజ్ బోర్డు సిఫార్సులు పత్రికా యాజమాన్యాలు అమలు చేసి తీరాలని,కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న పత్రికా సిబ్బందికి సైతం ఇవి వర్తిస్తాయని
సుప్రీంకోర్టు ధర్మాసనం 2017 జూన్ 19న తీర్పు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.అయినప్పటికీ యాజమాన్యాలు
ఈ తీర్పును ధిక్కరిస్తూవస్తున్నాయ న్నారు.ఈ పరిస్థితులను అధిగమించేం దుకు,గ్రామీణ జర్నలిస్టుల సౌకర్యాలు,హక్కుల సాధనకు రాష్ట్ర వ్యాప్త ఉద్యమం నిర్మించక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు.గ్రామీణ విలేకరులు ఐక్యంగా పోరాడి తమ హక్కులు సాధించుకోవాల్సిన అవసరం ఉందని,అందుకోసం తమతో కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో డబ్ల్యూజేఐ నాయకులు యంసాని శ్రీనివాస్, స్పాట్ వాయిస్ కృష్ణ మూర్తి యూట్యూబర్ సీనియర్ పాత్రికేయులు కొండ్రా శ్రీనివాస్ రావు యామ్స్ పెన్ ప్రత్యేక ప్రతినిధి ఆరెల్లి రాధాకృష్ణ,తెలంగాణ ధ్వని జనగాం బ్యూరో చీఫ్ సంగ కిరణ్ ప్రసాద్,రడపాక ప్రదీప్,బండ్ల కరుణాకర్,వల్లాల శివ,కృష్ణమూర్తి,సాక్ష్యం జనగామ బ్యూరో సంగోజు శ్రీనివాస్,జావిద్,పైడిపాలరాజు దండిగాం సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.