దేవాదుల నీటితో చెరువులు నింపాలని ప్రభుత్వంకు తెలంగాణ రైతు సంఘం డిమాండ్

ఈ69 న్యూస్ జఫర్గడ్,ఆగస్టు 06
దేవాదుల ప్రాజెక్ట్ ద్వారా జఫర్గడ్ మండలంలోని చెరువులు,కుంటలను నింపి రైతులకు సాగునీరు అందించాలని తెలంగాణ రైతు సంఘం మండల కార్యదర్శి నక్క యాకయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రాయపర్తి సోమయ్య,మండల పార్టీ కార్యదర్శి గుండెబోయిన రాజు తదితరులు తమ్మడపల్లి జి గ్రామంలో బుధవారం దేవాదుల వరద కాలువను సందర్శించారు.అనంతరం వారు మాట్లాడుతూ..ఉప్పుగల్లు నుంచి చెన్నూరు,పాలకుర్తి రిజర్వాయర్లకు వెళ్లే తిమ్మంపేట-జఫర్గడ్-తిమ్మాపురం-తమ్మడపల్లి జి-పాలకుర్తి గ్రామాల మీదుగా నిర్మించాల్సిన కాలువ పనులు రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టినట్టే చేసి ఆపివేసిందని ఆరోపించారు.ఆరు-ఏడేళ్ల క్రితమే రైతుల వద్ద నుంచి అర ఎకరానికి ఏడు,ఎనిమిది లక్షల రూపాయల వరకు పరిహారం చెల్లించి భూములు తీసుకున్నప్పటికీ ఇప్పటికీ కాలువ పనులు పదివేల వరకు మాత్రమే సాగాయని మండలి నేతలు విమర్శించారు.ఘన్పూర్ రిజర్వాయర్ నీరు నవాబుపేట-జనగాం వైపు పారుతూనే ఉంది.కానీ మా మండలంలో ఒక్క చుక్క సాగునీరు కూడా ఇవ్వని పరిస్థితి.శిరస్సుపై రిజర్వాయర్ ఉండి కూడా నీళ్లు అందని మా దుస్థితి పాపానపట్టున పెట్టేసింది”అని వారు ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా గొలుసు కట్టు ద్వారా ఇప్పగూడెం,సముద్రాల,సూరారం,జఫర్గడ్,తమ్మడపల్లి జి,ఓబులాపురం గ్రామాలకు నీటిని తరలించే ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని నక్క యాకయ్య డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు వడ్లకొండ రాజు,అన్నెపు ప్రభాకర్,వేల్పుల రవి,గంగరాజు,కొంతం చంద్రు,అంజయ్య,వేల్పుల రమేష్,రాములు,రాజయ్య,ఎల్లగౌడ్ రవి,చిలువేరి మల్లేష్,వేల్పుల నరేష్ తదితరులు పాల్గొన్నారు.