టిడబ్ల్యూజేఎఫ్తో బసవపున్నయ్యకు ఎలాంటి సంబంధం లేదు
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టిడబ్ల్యూజేఎఫ్)తో బసవపున్నయ్యకు ఎలాంటి సంబంధం లేదని,సంఘ వ్యతిరేక చర్యలకు పాల్పడినందున ఆయనను ఫెడరేషన్ నుంచి శాశ్వతంగా తొలగించినట్లు ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు,రాష్ట్ర కన్వీనింగ్ కమిటీ కన్వీనర్ మామిడి సోమయ్య స్పష్టం చేశారు.హైదరాబాద్‌లోని ఎన్ఎస్ఎస్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సోమయ్య ఫెడరేషన్ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వల్లాల జగన్,కో-కన్వీనర్లు బండి విజయ్ కుమార్,నేషనల్ కౌన్సిల్ సభ్యుడు ఎం.పద్మనాభరావులతో కలిసి వివరాలు వెల్లడించారు.ఈనెల 15న జరిగిన రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశానికి 30 జిల్లాల నుంచి 130 మంది రాష్ట్ర,జిల్లా బేరర్లు,కార్యవర్గ సభ్యులు,వ్యవస్థాపక సభ్యులు హాజరై,బసవపున్నయ్యను ఫెడరేషన్ నుంచి బహిష్కరించే తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించినట్లు తెలిపారు.సంఘానికి వచ్చిన సభ్యత్వ రుసుము,డైరీ-మ్యాగజైన్ ఆదాయ వివరాలు వెల్లడించకపోవడం,జిల్లాల మహాసభలను అడ్డుకోవడం వంటి చర్యలతో బసవపున్నయ్య సంఘాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించినట్లు ఆరోపించారు.ఇకపై ఆయనకు టిడబ్ల్యూజేఎఫ్తో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.రాష్ట్ర విస్తృత సమావేశం తర్వాత ఏర్పాటు చేసిన రాష్ట్ర కన్వీనింగ్ కమిటీ అనుమతి లేకుండా బసవపున్నయ్య గానీ,మరెవ్వరూ గానీ ఫెడరేషన్ పేరుతో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకూడదని హెచ్చరించారు.ఆదేశాలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని తెలిపారు.రాష్ట్ర కమిటీ రద్దయినందున ఎవరూ తమ పదవులను వాడుకోవద్దని,సభ్యత్వ నమోదు,జిల్లా,రాష్ట్ర మహాసభలు,ఎన్నికల నిర్వహణ బాధ్యతలు పూర్తిగా కన్వీనింగ్ కమిటీకి అప్పగించబడినట్లు తెలిపారు.బసవపున్నయ్య ఇప్పటికీ తానే ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శినని చెబుతూ జర్నలిస్టులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.ఆయన నిర్వహించే కార్యక్రమాలు నవతెలంగాణ పత్రికకు మాత్రమే సంబంధించినవని,ఫెడరేషన్తో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.నవతెలంగాణ పత్రిక జర్నలిస్టులకే ఫెడరేషన్‌ను పరిమితం చేసి తన సొంత యూనియన్‌గా మార్చుకోవాలనే కుట్రలో భాగంగా బసవపున్నయ్య పిలుపులు ఇస్తున్నారని ఆరోపించారు.శుక్రవారం కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వాలన్న పిలుపు చట్టవిరుద్ధమని హెచ్చరించారు.బసవపున్నయ్య నిర్వహించే వ్యక్తిగత కార్యక్రమాలకు ఎవరు హాజరకావద్దని ఫెడరేషన్ సభ్యులకు మామిడి సోమయ్య విజ్ఞప్తి చేశారు.