
తెలంగాణలోని వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో వైద్య విద్య చదువుతున్న గిరిజన వైద్య విద్యార్థిని ప్రీతిబాయి ని వేధింపులకు గురి చేసి ఆమె మరణానికి కారణమైన నిందితుడు సైఫ్ ను కఠినంగా శిక్షించాలని యస్సీ యస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా కూడా వాటిని అమలు పరచడంలో విఫలమవడం వలన ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని వీటిని అరికట్టడం ప్రభుత్వాల మీదనే కాకుండా సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు పైన ఉన్నదని ఆమె అన్నారు. గిరిజన జాతిలో పుట్టి ఒక ఉన్నతమైనటువంటి వైద్య విద్యను అభ్యసిస్తున్నటువంటి ప్రీతిబాయి సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులను భరించలేక ఎన్నో సందర్భాల్లో మెడికల్ కాలేజీ HOD దృష్టికి తీసుకువెళ్లినా కూడా ఉన్నతాధికారులు సరిగ్గా పట్టించుకోకపోవడం వలన ఒక మంచి భవిష్యత్తు ఉన్న ప్రీతిబాయిని కోల్పోవాల్సి వచ్చిందని ఆమె తెలిపారు. ప్రీతిబాయి చావుకు కారణమైన నిందితుడి వేధింపులపై, మెడికల్ కాలేజీ యాజమాన్యం తీరుపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేసి నిందితుడిని కఠినంగా శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు.