
టాడి కార్పొరేషన్ ద్వారానే నిర్వహించాలి
కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు
గళం న్యూస్ సెప్టెంబర్ 28 నడిగూడెం
నీరా కేఫ్ బిడ్డింగులను వెంటనే ఉపసంహరించి టాడి కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వమే నిర్వహించాలని కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం మండల కేంద్రంలో పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కల్లుగీత కార్మిక సంఘం ఇతర సంస్థలు సంఘాలు అనేక సంవత్సరాలుగా చేసిన పోరాటం ఫలితంగా 2019 న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నీరా పాలసీ తీసుకువచ్చి జీవో యం యస్ నెంబరు 116 విడుదల చేసిందన్నారు.గౌడ, ఈడిగ కులాల వారు మాత్రమే నీరా తీయడము, సేకరణ, అమ్మకాలు చేయాలని నిబంధనలు పేర్కొన్నారని 25 కోట్లు నీరా కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించి నెక్లెస్ రోడ్ లో నీరాకేఫ్ నిర్వహణ చేపట్టిందన్నారు.రంగారెడ్ది జిల్లా ముద్విన్, సంగారెడ్డి జిల్లా మునిపల్లి, యాదాద్రి భువనగిరి జిల్లా సర్వేల్ , నందనం నుండి నీరా సేకరణ చేయాలని నిర్ణయించింది. నందనములో మిషనరీ ఏర్పాటు చేసి అక్కడ బై ప్రొడక్ట్స్ తయారు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా ముద్విన్, చారుగొండ, చరికొండ, నాగిళ్ల గ్రామాల నుండి ఒక ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా నీరా సేకరణ జరుగుతుంది. ప్రారంభంలో నీరా కేఫ్ లో అమ్మకాలు బాగా జరిగాయి. ఇప్పుడు వర్షాకాలం కావడంతో అమ్మకాలు కొంత మేర తగ్గాయి. అందరికీ అందుబాటులో నీరా లేకపోవడంతో కూడా అమ్మకాలు తగ్గాయి. తాగాలనే కోరిక ఉన్నప్పటికీ దూరం ప్రయాణం చేయాల్సి వస్తుంది కాబట్టి అక్కడికి వెళ్లలేక పోతున్నారు. ఎక్కువ సెంటర్స్ లలో అమ్మితే అమ్మకాలు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం లాభాల దిశలోనే ఈ కేఫ్ నడుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభంలో దీని నిర్వహణ టూరిజం శాఖకు అప్పగించింది. మాకు టాడి కార్పొరేషన్ ఉండగా దానికి ఇవ్వడం ఎందుకు కార్పొరేషన్ ద్వారానే నడపాలని సంఘం అప్పుడు అభిప్రాయపడింది. టూరిజం శాఖ అయితే దానికి అన్ని జిల్లాలలో హోటల్స్ ,ఇతర పర్యాటక కేంద్రాలు ఉంటాయి కాబట్టి మార్కెటింగ్ బాగా ఉంటుందని వారు అన్నారు. మేము అప్పుడు అంగీకరించాము. ఐదు నెలలు గడవక ముందే ఇప్పుడు కావాలని ప్రభుత్వం నీరా కేఫ్ నిర్వహణకు టూరిజం శాఖ ద్వారా బిడ్డింగ్ కు టెండర్లు ను ప్రకటించటం సోషనీయమన్నారు. టెండర్ల ప్రక్రియను వెంటనే నిలుపుదల చేయకపోతే ఉద్యమానికి కార్యచరణ రూపొందిస్తామన్నారు. ప్రైవేటు సంస్థలు వారి లాభాల కోసమే పని చేస్తాయని గీత కార్మికులకు ఉపాధి పెంచాలనే ఆలోచన వాళ్లకు కలగదు అన్నారు. గీతా కార్మికుల కోసం ఉన్న టాడి కార్పొరేషన్ ద్వారానే అమ్మకాలు చేపట్టే విధంగా చర్యలు తీసుకొని గీత కార్మికుల అభివృద్ధి కొరకు ప్రభుత్వం కృషి చేయాలని కోరారు..