పర్యాటక అభివృద్ధిపై ఉన్నతాధికారుల పరిశీలన
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూర్ ఫారెస్ట్ రేగొండ పరిధిలోని ప్రముఖ ప్రదేశం పాండవుల గుట్ట వద్ద శనివారం పరిపాలనా మరియు అటవీ శాఖ ఉన్నతాధికారులు పర్యటించారు. పర్యావరణ పరిరక్షణ, పర్యాటక అభివృద్ధి చర్యలను ప్రత్యక్షంగా పరిశీలించి తగు సూచనలు అందించారు.
తెలంగాణ ఫారెస్ట్ ఫోర్స్ హెడ్ ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ శ్రీమతి సువర్ణ, సి సి ఎఫ్ కాళేశ్వరం ప్రభాకర్,భూపాలపల్లి డీఎఫ్ఓ నవీన్ రెడ్డి, జిల్లా ఎస్పీ సంకీర్త్ ఈ పర్యటనలో పాల్గొన్నారు.పాండవుల గుట్ట పరిసర ప్రాంతాల్లో సాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు,పర్యావరణ పరిరక్షణ చర్యలు, ఎకో టూరిజం అవకాశాలను అధికారులు సమీక్షించారు.
పాండవుల గుట్టను జిల్లా పర్యాటక కేంద్రంగా ఇంకా అభివృద్ధి చేసే దిశగా అవసరమైన సౌకర్యాలు, భద్రతా చర్యలు, సహజ అందాల పరిరక్షణపై సూచనలు ఇచ్చారు. అలాగే, అడ్వెంచర్ టూరిజం కార్యకలాపాలలో భాగంగా నిర్వహించిన రెప్పెల్లింగ్ మరియు ట్రెక్కింగ్ కార్యక్రమాల్లో అధికారులు స్వయంగా పాల్గొని యువతలో సాహస క్రీడలపై ఆసక్తి పెంపు అవసరాన్ని ప్రస్తావించారు.
పర్యాటకాన్ని ప్రోత్సహిస్తూ, పాండవుల గుట్టను జాతీయ స్థాయి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దే అవకాశాల గురించి అధికారులు చర్చించారు. చెల్పూర్ అటవీశాఖ అభ్యంతరం లేకుండా పర్యావరణ పరిరక్షణ–అభివృద్ధి కార్యకలాపాలను సమతుల్యం చేయాలని సూచనలు అందించారు.