పూజారుల వసతి గృహం,అన్నదాన సత్రముల ప్రారంభం
రేగొండ మండలం కొడవటంచ గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి ఆలయంలో ఎస్డీఎఫ్ నిధులు రూ.90 లక్షలతో నూతనంగా నిర్మించిన పూజారుల వసతి గృహం,అన్నదాన సత్రములను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు (జీఎస్సార్) శాస్త్రోక్తంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,దేవాలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలుగా మాత్రమే కాకుండా సామాజిక సేవకు నిలయాలుగా మారాలని అన్నారు. పూజారుల సౌకర్యార్థం వసతి గృహం ఏర్పాటు చేయడం అభినందనీయమని, భక్తులకు అన్నదానం అందించే సత్రం ద్వారా సేవాభావం మరింత విస్తరిస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆలయాల అభివృద్ధి, పూజారుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, భవిష్యత్తులో కూడా ఇలాంటి సదుపాయాలను మరింత విస్తరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
అనంతరం రేగొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత, రంగయ్యపల్లి గ్రామ వాసి పుల్లూరి బాపురావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను ఎమ్మెల్యే జీఎస్సార్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఐక్యత, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని అన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులు వెలుగులోకి రావడానికి ఇలాంటి టోర్నమెంట్లు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. ప్రభుత్వం క్రీడలు, యువత అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని, క్రీడాకారులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని తెలిపారు. యువత చదువుతో పాటు క్రీడలపైనా దృష్టి సారించి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. టోర్నమెంట్ ప్రారంభానికి ముందు క్రీడాకారులతో పరిచయం చేసుకుని వారికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పలువురు ప్రభుత్వాధికారులు, జిల్లా వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గుటో జు కిష్టయ్య, ఎన్ ఎస్ ఆర్ సంస్థల అధినేత నాయినేని సంపత్ రావు, ఎర్రబెల్లి రవీందర్రావు, మాజీ ఎంపీపీ పున్నం రవి, రేగొండ టౌన్ అధ్యక్షులు ఏనుగు రవీందర్ రెడ్డి,రేగొండ సర్పంచ్ వారణాసి మౌనిక అజయ్ పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.