పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
మహాదేవపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా ప్రజా పరిషత్ సెకండరీ పాఠశాలలో 1994–95 విద్యా సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం రోజున అత్యంత ఉత్సాహభరితంగా,స్నేహపూర్వక వాతావరణంలో ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమంలో దాదాపు 80 మందికి పైగా పూర్వ విద్యార్థులు పాల్గొని తమ విద్యార్థి జీవితపు మధుర జ్ఞాపకాలను ఒకరితో ఒకరు పంచుకున్నారు.అప్పటి రోజుల్లో తమకు విద్యాబోధన చేసిన గురువులను స్మరించుకుంటూ,వారు చూపిన మార్గదర్శకత్వం, క్రమశిక్షణ, విలువలు తమ జీవితాల్లో ఎలా ఉపయోగపడ్డాయో గుర్తు చేసుకున్నారు.ఈ సందర్భంగా తమకు విద్యను అందించిన సత్యనారాయణ రెడ్డి, సంజీవరెడ్డి, ఎల్లయ్య, మోహన్, జైపాల్ రెడ్డి, అంకమ్మ, దేవరాజ్, బిక్షపతి తదితర ఉపాధ్యాయులను ప్రత్యేకంగా ఆహ్వానించి ఘనంగా సన్మానించారు.గురువుల ఆశీస్సులు ఎల్లప్పుడూ తమపై ఉండాలని కోరుకుంటూ, వారి సేవలను కొనియాడారు.పాఠశాల అభివృద్ధి పట్ల తమ బాధ్యతను చాటుకుంటూ, పూర్వ విద్యార్థులు పాఠశాలలో వాటర్ ట్యాంక్ నిర్మాణం కోసం ముందస్తుగా రూ.1 లక్ష విరాళాన్ని ప్రకటించి అందజేయడం విశేషంగా నిలిచింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు హాజరై మాట్లాడుతూ,పూర్వ విద్యార్థులు పాఠశాల అభివృద్ధికి చేయూతనివ్వడం అభినందనీయమని పేర్కొన్నారు. విద్యతో పాటు గ్రంథాలయాల ప్రాధాన్యతను వివరించిన ఆయన, సమాజాభివృద్ధిలో పుస్తకాల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. ఆయన విజ్ఞప్తి మేరకు గ్రంథాలయాలకు పుస్తకాలను విరాళంగా అందిస్తామని పూర్వ విద్యార్థులు హామీ ఇవ్వడం జరిగింది.అలాగే కార్యక్రమంలో సీఐ వెంకటేశ్వర్లు కూడా పాల్గొని పూర్వ విద్యార్థుల ఐక్యత,సామాజిక బాధ్యతపై ప్రశంసలు కురిపించారు.ఈ ఆత్మీయ సమ్మేళనం పాత స్నేహాలను మరింత బలపరచడమే కాకుండా, తమ పాఠశాల పట్ల ఉన్న కృతజ్ఞత భావాన్ని కార్యరూపంలో చూపిన కార్యక్రమంగా నిలిచింది.