ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం
ఘనపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.50 కోట్లు-ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు స్టేషన్ ఘనపూర్‌ను మున్సిపాలిటీగా ఏర్పాటు చేసి, దాని అభివృద్ధికి రాష్ట్రంలోనే అత్యధికంగా రూ.50 కోట్ల నిధులు మంజూరు చేయించామని మాజీ ఉప ముఖ్యమంత్రి,స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు.స్టేషన్ ఘనపూర్ పట్టణ కేంద్రంలో రూ.7 కోట్లతో చేపట్టనున్న పలు కాలనీల సీసీ రోడ్లు,డ్రైనేజీల నిర్మాణ పనులకు వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డా.కడియం కావ్య, జనగామ జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషాతో కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి శంకుస్థాపన చేశారు.అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తే స్టేషన్ ఘనపూర్‌ను మున్సిపాలిటీగా చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చానని,ఇచ్చిన మాట ప్రకారం ఘనపూర్,శివునిపల్లి,చాగల్ గ్రామాలను కలిపి స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ ఏర్పాటు చేశామని తెలిపారు.దీనికి సంబంధించి 2025 జనవరి 25న ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు.గత 15 ఏళ్లుగా ఘనపూర్‌లో చెప్పుకోదగ్గ అభివృద్ధి జరగలేదని,అంతర్గత సీసీ రోడ్లు,డ్రైనేజీలు,విద్యుత్,తాగునీటి సమస్యల పరిష్కారానికి రూ.50 కోట్ల అభివృద్ధి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించగా,2025 సెప్టెంబర్ 29న స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.50 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిందని వెల్లడించారు.రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీకి కూడా ఇంత పెద్ద మొత్తంలో నిధులు మంజూరు కాలేదని పేర్కొన్నారు.ఈ నిధుల్లో భాగంగా ఈ రోజు రూ.7 కోట్ల పనులకు శంకుస్థాపన చేశామని,మరో వారం రోజుల్లో రూ.11 కోట్ల పనులకు శంకుస్థాపన చేస్తామని తెలిపారు.ఆ పనుల్లో లైబ్రరీ,మున్సిపాలిటీ కార్యాలయం,ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వంటి కీలక అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయని వివరించారు.మున్సిపాలిటీకి మంజూరైన రూ.50 కోట్ల పనులను ఒకే సంవత్సరంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తానని హామీ ఇచ్చారు.వచ్చే ఆర్థిక సంవత్సరంలో ముఖ్యమంత్రిని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసి మరో రూ.50 కోట్ల నిధులు మంజూరు చేయిస్తానని చెప్పారు.నియోజకవర్గానికి మరో 3,500 ఇందిరమ్మ ఇళ్లు రానున్నాయని,అందులో మున్సిపాలిటీ పరిధిలోని 18 వార్డులకు ఒక్కో వార్డుకు 25 చొప్పున మొత్తం 450 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని తెలిపారు.కొంత మంది చాలా మాటలు మాట్లాడుతున్నారని,కానీ అభివృద్ధి పనులు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు.అవినీతి,అక్రమాలకు పాల్పడటమే తప్ప ప్రజల సమస్యలు పట్టించుకోలేదని ఆరోపించారు.పనులు,పదవులు,పథకాలు అమ్ముకున్నవారు మళ్లీ ఓట్ల కోసం వస్తున్నారని,అలాంటి వారిని నమ్మితే ఘనపూర్‌కు నష్టం జరుగుతుందని హెచ్చరించారు.మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వ సహకారం అవసరమని,అందుకే రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలను కోరారు.నియోజకవర్గ అభివృద్ధే తన ఏకైక లక్ష్యమని,ఆ లక్ష్యం నెరవేరాలంటే ప్రజల సహకారం తప్పనిసరి అని తెలిపారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ లావణ్య శిరీష్ రెడ్డి,మున్సిపల్ కమిషనర్,ఆర్డీవో,మున్సిపల్ అధికారులు,స్థానిక నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.