ప్రవక్త ముహమ్మద్ జీవితం సర్వ మానవాళికి ఆదర్శం
కొండూరులో జల్సా సీరతున్నబీ సదస్సు
ప్రవక్త ముహమ్మద్ జీవన సందేశాలపై విస్తృత ప్రసంగాలు
వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండూరు గ్రామంలో అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ యువజన సమితి ఆధ్వర్యంలో జల్సా సీరతున్నబీ(ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్ర)సదస్సు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో శాంతియుతంగా సాగి విజయవంతంగా ముగిసింది.సదస్సు పవిత్ర ఖురాన్ గ్రంథం పారాయణం మరియు ఉర్దూ పద్య పఠనంతో ప్రారంభమైంది.జిల్లా అధ్యక్షులు ముహమ్మద్ యాకూబ్ పాషా (కలీముల్లాహ్) అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా అహ్మదీయ మౌల్వీలు మస్తాన్ పాషా,అయాన్ పాషా,ఆసిఫ్ అహ్మద్ ఖాదిం,హుస్సేన్,కబీర్ పాషా తదితరులు ప్రసంగించారు.వారు పవిత్ర ప్రవక్త హజ్రత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవన చరిత్రలోని సత్యం,న్యాయం,శాంతి,సహనం,మానవత్వం వంటి ఉన్నత విలువలను విశదీకరించారు.ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితం సర్వ మానవాళికి ఆదర్శమని,ఆయన బోధనలు నేటి సమాజానికి అత్యంత అవసరమని వక్తలు పేర్కొన్నారు.ప్రవక్త జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని సమాజంలో సద్గుణాలు పెంపొందించుకోవాలని,పరస్పర సౌభ్రాతృత్వం,శాంతియుత సహజీవనం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు.ఈ జల్సా సీరతున్నబీ సదస్సు సమాజంలో నైతిక విలువలు,శాంతి,సౌభ్రాతృత్వాన్ని ప్రోత్సహించే విధంగా ఎంతో ఫలప్రదంగా నిర్వహించబడిందని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక అధ్యక్షుడు ఇంక్షాఫ్ అలి, వయోజన సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ముహమ్మద్ సలీం,స్థానిక మౌల్వీ ఆస్ఘర్,లతీఫ్,నజీర్,యూసుఫ్,నూరుద్దీన్,అబ్బాస్ అలీ,నాసిర్,ఖుర్బాన్ అలీ,బషీర్,ఇక్బాల్,అక్బర్,వలీపాష,అయ్యూబ్ వివిధ గ్రామాల అహ్మదీయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.