ఫిబ్రవరి 5న ఢిల్లీలో ‘మార్చ్ టు పార్లమెంట్’
ఉపాధ్యాయుల ఐక్య పోరాటానికి పిలుపు జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం రెవిన్యూ డివిజన్ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్) జనగామ జిల్లా ఉపాధ్యక్షుడు మంగు జయప్రకాశ్ మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీనియర్ ఉపాధ్యాయులను ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నుంచి మినహాయించాలని,ప్రభుత్వ విద్యకు నష్టం కలిగించే జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.పాఠశాలల మూసివేతలు,విలీనాలను వెంటనే నిలిపివేయాలని,ఎన్‌పిఎస్-సిపిఎస్‌లను రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)ను పునరుద్ధరించాలని,సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని ఆయన కోరారు.అలాగే ప్రాథమిక ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుహక్కు కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ డిమాండ్ల సాధన కోసం అఖిల భారత ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ (ఎఐ జాక్టో) ఆధ్వర్యంలో ఫిబ్రవరి 5న ఢిల్లీలో నిర్వహించనున్న‘పార్లమెంట్ మార్చ్’ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.సుప్రీంకోర్టు తీర్పు వచ్చి నాలుగు నెలలు గడిచినా కేంద్ర ప్రభుత్వం గానీ,జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటిఈ) గానీ స్పందించకపోవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.2010 ఆగస్టు 23కు ముందు నియామకమైన ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు ఉన్న విషయాన్ని ఎన్సీటిఈ సుప్రీంకోర్టుకు సరిగా తెలియజేయలేదని ఆరోపించారు.సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రెండేళ్లలో టెట్ ఉత్తీర్ణులు కాకపోతే లక్షలాది ఉపాధ్యాయులు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని,వేలాది పాఠశాలలు మూతపడే పరిస్థితి ఏర్పడి పేద విద్యార్థులకు విద్య దూరమయ్యే అవకాశం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.విద్యా వ్యవస్థలో నెలకొన్న సంక్షోభానికి కేంద్ర ప్రభుత్వం మరియు ఎన్సీటిఈ బాధ్యత వహించాలని పేర్కొంటూ,తక్షణమే సుప్రీంకోర్టులో రివ్యూ లేదా క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేయాలని,లేకపోతే సీనియర్ ఉపాధ్యాయులకు రక్షణ కల్పించేలా విద్యా హక్కు చట్టంలో సవరణలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ నెల 9న రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై నిరసన తెలియజేయాలని,అన్ని జిల్లాల నుంచి రాష్ట్రపతి,ప్రధానమంత్రికి మెమోరాండంలు పంపాలని,ఫిబ్రవరి 5న పెద్ద సంఖ్యలో ఢిల్లీకి వెళ్లి పార్లమెంట్ మార్చ్‌లో పాల్గొనాలని మంగు జయప్రకాశ్ పిలుపునిచ్చారు.