
బిఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు బిఆర్ఎస్ పార్టీ నాయకులకేనా
దళితుల అభివృద్ధి కోసం, ఇండ్లు లేని నిరుపేదల కోసం బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన దళిత బందు, గృహ లక్ష్మి పథకాలు కేవలం బిఆర్ఎస్ పార్టీ నాయకులకు,కార్యకర్తలకే కేటాయించాడం దుర్మార్గమని మండలం లోని రత్నవరం గ్రామం లో దళితులు ఆరోపించారు. సోమవారం పార్టీలకు అతీతంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో దళితులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం దళితులు ఆర్థికంగా ఎదగటం కోసం ప్రవేశ పెట్టిన దళితుల బందు,ఇండ్లు లేని నిరుపేదల కోసం ప్రవేశ పెట్టిన గృహ లక్ష్మి పథకాలు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే అందేలాగా ఆ పార్టీ నాయకులు ఎమ్మెల్యే తో పైరవి లు చేయడం తగదని వారు అన్నారు.బిఆర్ఎస్ ప్రభుత్వం లో ఇతర పార్టీ లో ఉన్న అర్హులైన పేదలకు ప్రజలకు సంక్షేమ పథకాలు అందడం లేదని ఆరోపించారు.గృహలక్ష్మి, దళిత బంధు, బీసీ బందు అన్ని సంక్షేమ పథకాలు బిఆర్ఎస్ కార్యకర్తలకు కేటాయించడం సిగ్గుచేటు అన్నారు. ఉద్యమ సమయం లో కెసిఆర్ ఇచ్చిన దళిత ముఖ్యమంత్రి హామీని, కెసిఆర్ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తరువాత దళితులకు మూడు ఎకరాల భూమి హామీ లను ఇప్పుడు మేము అడగడం లేదని, ఇప్పుడు ప్రవేశ పెట్టిన పథకాలను నిజమైన పేదలకు అందించాలని మాత్రమే అడుగుతున్నామన్నారు. ఉమ్మడి రాష్ట్రం లో గతంలో ఉన్న ప్రభుత్వాలు అన్ని పార్టీలలో ఉన్న పేద ప్రజలను గుర్తించి సంక్షేమ పథకాలు కేటాయించే వారని,కాని దానికి భిన్నంగా బిఆర్ఎస్ పార్టీ పాలన కొనసాగిస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాలలో బిఆర్ఎస్ నాయకులు మాదే రాజ్యం మా ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం తగదన్నారు. గ్రామంలో భూములు ఉన్నవారికి, గతంలో ఎస్సీ కార్పొరేషన్ లోన్లు తీసుకున్న వారికి మళ్ళీ తిరిగి దళిత బంధు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీల దామాషా ప్రకారం దళిత బందు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నిజమైన పేద వారిని గుర్తించి సంక్షేమ పథకాలు అందించాలని వారు డిమాండ్ చేశారు. అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించక పోతే రాబోయే ఎన్నికల్లో కోదాడ ఎమ్మెల్యే మలయ్య యాదవ్ దళితుల ఆగ్రహనికి గురికాక తప్పదని హెచ్చరించారు.గృహ లక్మి పథకం ప్రభుత్వ అధికారులు ద్వారా ఎంపిక చేయాలి తప్ప బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ నాయకులతో ఎంపిక చేయించడం తగదన్నారు. గూడు లేక గోస పడుతున్న పేదలను కాదని భూములు ఉన్నవారిని ఈ పథకానికి ఎంపిక చేయడం బాధాకరమన్నారు.అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందించక పోతే రాబోయే రోజులలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు.ఈ సమావేశం లో గ్రామ ఉపసర్పంచ్ మొలుగూరి ఉపేందర్, ఎమ్మార్పీఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు నర్సింహారావు, అమరబోయిన రమేష్,ఆదిమల్ల ఉపేందర్, మొలుగూరి నాగరాజు, నందిపాటి సుశీల, మొలుగూరి నాగమణి, మొలుగూరి గురవమ్మ,నేమ్మాది సీతమ్మ,లక్ష్మి, ప్రశాంతి, గోవింద్,చిన్న సైదులు తదితరులు పాల్గొన్నారు