
మంత్రి వ్యాఖ్యల వెనుక కేసీఆర్ హస్తం
కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం
ఈసీ తక్షణమే ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించాలి
నకిరేకల్ లో భారీ ఎన్నికల సన్నాహక ర్యాలీ
గలం న్యూస్ పాలకుర్తి; వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసిన గ్రామాలకు అత్యధిక నిధులు కేటయించాలని పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలివ్వడం అధికార దుర్వినియోగమేనని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. గురువారం చౌటుప్పల్, నకిరేకల్ లో నిర్వహించిన ఎన్నికల సన్నాహక ర్యాలీలో పాల్గొని ప్రసంగించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.మంత్రి వ్యాఖ్యలపై త్వరలోనే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యల వెనుక ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తం ఉన్నట్లు ఆరోపించారు.తక్షణమే ఎన్నికల సంఘం మంత్రిపై చర్యలు తీసుకొని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకుండా నివారించాలన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా అధికార బీఆర్ఎస్ నేతలకు పోలీసులు తోత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల ముందు కేసీఆర్ ప్రకటించే తాయిళాలకు ప్రజలు మోసపోవద్దన్నారు.ప్రతిపక్ష నేతల ఫోన్లను ప్రభుత్వం ట్యాప్ చేస్తుందని అన్నారు.
మునుగోడు, నకిరేకల్ నియోజకవర్గాల్లో ఉన్న పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు. డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించే చర్లగూడెం రిజర్వాయర్ భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించడంలో ప్రభుత్వం మీనామీషాలు లెక్కిస్తుందని, తక్షణమే రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ ప్రాంతాలకు మిషన్ భగీరథ నీళ్లు అందడంలేదన్నారు.బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టుకు పూర్తిస్థాయిలో భూసేకరణ జరుగలేదన్నారు. మూసీ ప్రాజెక్టు ఆధునీకరణ చేయలేదన్నారు.పిలాయిపల్లి, ధర్మారెడ్డి కాలువలు పట్టించుకోవడంలో పాలకులు విఫలమయ్యారన్నారు. ఐటిపాముల ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడంలో,ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నిర్మించడంలో కెసిఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందన్నారు.సూర్యాపేటలో బీసీ నేత జానయ్యను చంపేందుకు మంత్రి జగదీష్ రెడ్డి కుట్ర పన్నుతున్నారని,జానయ్య ప్రాణాలకు హాని జరిగితే బీఎస్పీ శ్రేణులు రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తామన్నారు. సూర్యాపేటలో ఉన్నత విద్యావంతురాలైన మేడి ప్రియదర్శిని నకిరేకల్ లో అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు.