మహిళా సాధికారతతోనే ప్రజాస్వామ్యం పటిష్టం
ఆచరణలో హక్కులు దక్కని మహిళలు
వారి హక్కుల కోసం నిలదీస్తున్న ఐద్వా
పోరాటానికి సమాజం కలిసి రావాలి : ఐద్వా జాతీయ కోశాధికారి పుణ్యవతి 14వ ఐద్వా మహాసభల పోస్టర్ ఆవిష్కరించిన ఐద్వా నేతలు
మహిళా సాధికారతతోనే ప్రజాస్వామ్యం పటిష్టమవుతుందని ఐద్వా జాతీయ కోశాధికారి ఎస్. పుణ్యవతి తెలిపారు. మహిళల హక్కుల కోసం పోరాటాలకు తలొగ్గి అనేక చట్టాలు వచ్చినప్పటికీ ఆచరణలో మాత్రం అవి అమలు కావడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చట్టపరమైన హక్కుల సాధన, ఉన్న చట్టాల అమలు కోసం ఐద్వా నినదిస్తూనే ఉందన్నారు. తమ పోరాటంలో సమాజం కలిసి రావాలని ఆమె పిలుపునిచ్చారు. సోమవారం హైదరాబాద్‌లోని సోమాజీగూడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్.అరుణజ్యోతి, మల్లు లక్ష్మి, సహాయ కార్యదర్శులు బుగ్గవీటి సరళ, కె. ఎన్. ఆశాలతలతో కలిసి 14 ఐద్వా అఖిల భారత మహాసభల పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా పుణ్యవతి మాట్లాడుతూ మహిళలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యపై ఐద్వా పోరాడిందని గుర్తుచేశారు. 1981లో ఐద్వా ఆవిర్భవించిందనీ, అంతకు ముందు ఆంధ్ర ప్రాంతంలోని 13 జిల్లాలు, బళ్లారితో కలుపుకుని తూర్పు కృష్ణ మహిళా సంఘం ఉండేదనీ, తెలంగాణలో ఆంధ్ర మహిళా సభ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్నదని తెలిపారు. అదే విధంగా సరోజినీ నాయుడు నేతృత్వంలో ఆల్ ఇండియా మహిళా మహాసభను నడిపించారని చెప్పారు. ఓటు హక్కు, ఆస్తిలో హక్కు తదితర హక్కులను సమానంగా మహిళలకు ఇప్పించేందుకు జరిగిన పోరాటాలకు వారసులుగా ఉన్నందుకు సంతోషం వ్యక్తం చేశారు.
సుదీర్ఘ పోరాటంలో మహిళలు అనేక హక్కులు సాధించుకున్నప్పటికీ చేయాల్సిన పోరాటం ఇంకా మిగిలే ఉందని పుణ్యవతి స్పష్టం చేశారు. మహిళలు ఇంట్లో 8 గంటలు, బయట 8 గంటలు పని చేస్తున్నారనీ, వారి విషయంలో 8 గంటల పని విధానమేదని ప్రశ్నించారు. డాక్టర్ బీ. ఆర్. అంబేద్కర్ రాజ్యాంగంలో ఎలాంటి బేధాలు లేకుండా స్త్రీ, పురుషులకు సమాన హక్కులు కల్పించినప్పటికీ వాటిని అమలు చేయలేదని గుర్తుచేశారు. మహిళలకు ఉపాధి దక్కకుండా నరేగా చట్టాన్ని రద్దు చేసి వీబీజీ రాంజీ చట్టం తెస్తున్నారని ఆమె విమర్శించారు. బీహార్‌లో 65 లక్షల మంది ఓటు హక్కును తొలగించారనీ, అందులో 65శాతం మంది మహిళలే ఉన్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా మహిళల ఓటు హక్కును తీసేసే కుట్ర చేస్తున్నారని ఆమె ఆరోపించారు. వివాహిత మహిళకు అత్త ఇల్లే సొంతమని చెబుతున్న పాలకులు, ఆమె ఓటు హక్కు కోసం ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్, రేషన్ కార్డ్, బర్త్ సర్టిఫికెట్ తేవాలంటూ ఇబ్బందులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం పాఠశాల విద్య కూడా చదవని మహిళలకు ఎక్కడి నుంచి బర్త్ సర్టిఫికెట్ తెస్తారని ఆమె ప్రశ్నించారు. ఈ దేశంలో ఆస్పత్రుల్లో జన్మించిన మహిళలెందరుంటారని ఆమె ప్రశ్నించారు. ఉన్నావ్‌లో కేసులో మైనర్ బాలికపై లైంగిక దాడి, ఆమె సంబంధీకులపై దాడి చేసి హత్య చేసిన అధికార పార్టీ ఎమ్మెల్యేకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఇచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మహాసభల్లో జరిపే చర్చలు కీలకమని వివరించారు. మహాసభలను సినీ నటి, మహిళా ఉద్యమకారణి, పెరియార్ భావాలతో ఉత్తేజితురాలైన రోహిణీ ప్రారంభిస్తుందని పుణ్యవతి తెలిపారు. మహాసభల ఆహ్వాన సంఘానికి శాంతా సిన్హా అధ్యక్షురాలిగా ఉండగా తనతో పాటు పలువురు జాతీయ నాయకులు పాల్గొంటున్నట్టు వెల్లడించారు.
మల్లు లక్ష్మి మాట్లాడుతూ ఈ నెల 25న హైదరాబాద్ లో వేలాది మందితో ప్రదర్శన నిర్వహించి బస్ భవన్ వద్ద గ్రౌండ్లో బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. మహాసభల్లో భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకుంటామని వెల్లడించారు. సమాన పనికి సమాన వేతనం, బాల్య వివాహాల నిరోధక చట్టం, ఆస్తి హక్కు తదితర హక్కులను ఐద్వా పోరాటాలతో సాధించిందని తెలిపారు. మద్యపాన నిషేధ ఉద్యమంతో మాజీ సీఎం ఎన్టీఆర్ తో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిషేధం అమలు చేయించడంలో ఐద్వా కీలకపాత్ర పోషించిందని గుర్తుచేశారు. మహిళల నిష్పత్తి తగ్గిపోకుండా భ్రూణహత్యలకు వ్యతిరేకంగా పోరాటాలు, గ్రామాల్లో సర్వేలు, స్కానింగ్ సెంటర్లపై నిఘా పెట్టినట్టు తెలిపారు. మైక్రో ఫైనాన్స్ వేధింపుల నుంచి బాధిత మహిళలను రక్షించేందుకు ఐద్వా అండగా నిలబడిందన్నారు. 3.55 లక్షల మంది సభ్యత్వం కలిగిన ఐద్వా మహిళలకు ఎక్కడ సమస్య ఉంటే అక్కడుంటుందని ఆమె భరోసానిచ్చారు.
రాష్ట్రంలో మహిళలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని మల్లు లక్ష్మి డిమాండ్ చేశారు. గ్రామాల్లో, పట్టణాల్లో తగ్గించిన బస్సుల సంఖ్యను పెంచాలని కోరారు. ప్రతి మహిళకు రూ.2,500 తదితర హామీలను ఆమలు చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఐద్వా పోరాటాలను తీవ్రతరం చేయబోతున్నదనీ, సమాజంలోని కవులు, కళాకారులు, మేధావులు, ప్రజలు మద్దతునివ్వాలని లక్ష్మి కోరారు