మినీ మేడారం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు
సమ్మక్క – సారలమ్మ తల్లుల చల్లని చూపుతో ప్రజలంతా సుభిక్షంగా, సుఖశాంతులతో ఉండాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆకాంక్షించారు.బుధవారం భూపాలపల్లి నియోజకవర్గంలోని మొగుళ్లపల్లి మండల పరిధిలో ములకలపల్లి – మొగుళ్లపల్లి గ్రామాల మధ్య పెద్దవాగు ఒడ్డున ప్రకృతి ఒడిలో ఘనంగా నిర్వహిస్తున్న మినీ మేడారం సమ్మక్క – సారలమ్మ జాతరను ఆయన దర్శించుకున్నారు.ఈ సందర్భంగా సమ్మక్క – సారలమ్మ తల్లులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే, అనంతరం మాట్లాడుతూ గిరిజన ఆదివాసీ ప్రజల ఆరాధ్య దైవమైన సమ్మక్క – సారలమ్మ తల్లులను దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.ప్రజలు కోరిన కోరికలు తీర్చుతూ, వారి కష్టాలను తొలగించే శక్తి వనదేవతలైన సమ్మక్క – సారలమ్మ తల్లులకే ఉందని ఆయన పేర్కొన్నారు.మునుపెన్నడూ లేని విధంగా భూపాలపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న అన్ని మినీ మేడారం జాతరలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.భక్తుల భద్రత, సౌకర్యాల దృష్ట్యా వైద్య సేవలను అందించేందుకు జాతర ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్‌ను ఆయన ప్రారంభించారు. అదేవిధంగా భక్తుల రాకపోకలు, భద్రత పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కూడా ప్రారంభించారు.జాతరను భక్తులు శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని ఎమ్మెల్యే కోరారు. సమ్మక్క – సారలమ్మ తల్లుల ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరికీ మంచి జరగాలని ఆయన ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంటా పలువురు ప్రభుత్వ అధికారులతో పాటు జిల్లా కాంగ్రెస్ నాయకులు మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.