ఉగాది వేడుకల్లో పాల్గొన్న బీ ఆర్ ఎస్ రాష్ట్ర నాగేష్ ముదిరాజ్
విశ్వ వాసు నమః ఉగాది పండుగ సందర్భంగా బాపూజీ నగర్, భౌదనగర్ డివిజన్లలో జరిగిన ఉగాది వేడుకల్లో పాల్గొన్న బీ ఆర్ ఎస్ రాష్ట్ర నాగేష్ ముదిరాజ్ మాట్లాడుతూ 2025 విశ్వావసు నామ సంవత్సరం. హిందు సంవత్సరాలలో ఇది 39 ది.
విశ్వావసు ఎవరు?
విశ్వావసు 6000 గంధర్వులలో ఒక గంధర్వుడు. గంధర్వులు మంచి గాయకులు, నృత్యకారులు, సంగీతకారులు మరియు మంచి సౌందర్యవంతులు. అప్సరసులలో సహగమనం చేస్తూ ఉంటారు. విశ్వావసు తన తపస్సుతో బ్రహ్మ దేవుని నుంచి అమరత్వం సిద్దించుకున్నాడు. ఆ తరవాత అతను అహంకారంతో ఇంద్రుని మీద దాడి చేసి, ఇంద్రుని క్రోధానికి గురియైనాడు. ఇంద్రుడు తన వజ్రాయుధంతో విశ్వాసుని చేతులని, తొడలని శరీరంలో తోసివేశాడు. దానితో విశ్వాసుడు చేతులు, తొడలు లేని వికృత రూపం పొందాడు. తన తప్పు తెసుకున్న విశ్వాసుడు ఇంద్రుని వేడుకున్నాడు. ఇంద్రుడు కరుణించి, తనికి రెండు పొడవైన చేతులతో పాటు, పొట్టపై భుజించుటకు వీలుగా ఒక నోటిని ఇచ్చాడు. అలా విశ్వాసుడు కబంధుడై అరణ్యంలో జీవించాడు. అతను భయంకరమైన ఈ రూపం ధరించి వనాలలో ఉండే మునులను భయపెట్టుతూ వచ్చాడు. ఇలా చేస్తూండగా ఒకసారి స్థూలశిరుడనే మహాముని తటస్థపడి, ” నీకి రూపమే శాశ్వతంగా ఉండిపోవు గాక !”. అని శపించాడు. అప్పు డీ కబంధుడు మునికి క్షమాపణ చెప్పుకుని శాప విముక్తి ఎలాగని అడిగాడు. “ఎప్పుడు రాముడు అడవికి వచ్చి, నీ చేతులు నరికి నీకు దహనక్రియలు చేస్తాడో అప్పుడు నీకు యథారూపం వస్తుంది,” అని ముని చెప్పి వెళ్ళిపోయాడు.
విశ్వావసుడి శాప విమోచనం
శ్రీరాముడు, లక్ష్మణుడు సీతను వెతుకుతూ అరణ్యంలో సంచరిస్తూ ఉండగా విచిత్ర రూపంలో ఉన్న ఓ రాక్షసుడు రామలక్ష్మణులకు ఎదురయ్యాడు. అతనికి తల, మెడ, కాళ్ళు లేవు. ఉదరం- అంటే కడుపు భాగంలో మాత్రం ఓ పేద్ద నోరుంది. ఊరువుల ప్రదేశంలో రెండు ఉగ్రనేత్రాలున్నాయి. అతని బాహువులు మాత్రం ఎనిమిది యోజనాలవరకు విస్తరించి ఉన్నాయి. అటువంటి రాక్షసుడు ఒక్కసారిగా రామలక్ష్మణులను తన హస్తాలతో బంధించి గుప్పిట్లో బిగించాడు. దీనికే “కబంధ హస్తం” అనే నానుడి ఉన్నది. భయకరమైన నోటిని తెరిచి వారిని ఆరగించబోతుండగా రాముడు కుడి చేతిని, లక్ష్మణుడు ఎడం చేతిని నరికివేయడంతో ఆ రాక్షసుడు నేలకు ఒరిగాడు. తనని గాయపరిచింది రాముడు అని తెలుసుకుని కబంధుడు ఎంతో సంతోషించాడు. కబంధుడు తన వృత్తాంతం తెలిపి తనకి అంత్యక్రియలు నిర్వహించమని శ్రీరాముడిని కోరగా, రాముడి అతని కోరిక మీరా అలానే చేస్తాడు. కబంధుడు తన పూర్వ గంధర్వ రూపం సంతరించుకుంటాడు. ఆ విశ్వావసు నామమే హిందు సంవత్సరాలలో ఒకటి.
శాస్త్రాల ప్రకారం, ‘‘ఉగ’’ అంటే నక్షత్ర గమనం లేదా జన్మ, ఆయుష్ అనే అర్థాలు కూడా ఉన్నాయి. వీటికి ఆది ఉగాది. అంటే విశ్వంలోని జీవకోటి రాశుల ఆయుష్షుకు తొలి రోజు ఉగాది. ఇంకో కథనం ప్రకారం, ‘యుగం’ అంటే రెండు లేదా జంట అని అర్థం. ఉత్తరాయణ, దక్షిణాయణాల మధ్య సంయుతం యుగం(ఏడాది)కాగా, ఈ యుగానికి ఆది ఉగాది అవుతుందని పండితులు చెబుతున్నారు. అంతేకాదు ఉగాది నుంచే వసంత బుుతువు ప్రారంభమవుతుంది. పురాణాల ప్రకారం, ఛైత్ర మాసం శుక్ల పక్షం శుద్ధ పాడ్యమి తిథి నాడు అంటే ఉగాది రోజున సృష్టి ప్రారంభమైనట్లు పండితులు చెబుతారు. వేదాలను తస్కరించిన సోమకుడిని హతమార్చి మత్స్యావతారంలో ఉండే విష్ణువు వేదాలను బ్రహ్మ దేవుడికి అప్పగించిన శుభ తరుణ పురస్కారంగా విష్ణువు ప్రీత్యర్థం ‘‘ఉగాది’’ఆచరణలోకి వచ్చిందని చాలా మంది నమ్ముతారు. ఛైత్ర శుక్ల పాడ్యమి తిథి నాడే ఈ విశాల ప్రపంచాన్ని బ్రహ్మదేవుడు సృష్టించినట్లు పండితులు చెబుతారు. అందుకే సృష్టి ఆరంభానికి సంకేతంగా ఉగాది పండుగను జరుపుకుంటారు.
ఉగాది పండుగ వేళ శిశిర బుుతువుకు వీడ్కోలు పలికి.. వసంత బుుతువుకు స్వాగతం పలుకుతాం. ఈ సమయంలోనే చెట్లు చిగురించడం ప్రారంభమవుతాయి. కోయిల రాగాలు వినిపిస్తాయి. తెలుగు వారి నూతన సంవత్సరం కూడా ఉగాది నుంచే ప్రారంభమవుతుంది. అందుకే దీన్ని తెలుగు వారి తొలి పండుగ అంటారు. ఈ పవిత్రమైన రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఉదయాన్నే తలస్నానం చేసి, ఇంటిని మామిడాకులతో అలంకరించి, కొత్త బట్టలు ధరించి, ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు.
ఉగాది అంటే అందరికీ టక్కున గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఆరు రుచుల కలయికతో ఉండే ఈ పచ్చడి తెలుగు వారందరికీ ఎంతో ప్రత్యేకం. తీపి, కారం, పులుపు, వగరు, చేదు, ఉప్పు అనే షడ్రుచుల కలయిక జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలు, మంచి, చెడుల గురించి వివరిస్తుంది. ఈ పచ్చడిలో చెరకు, అరటిపండ్లు, మామిడికాయలు, వేపపువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం వంటి వాటిని తప్పనిసరిగా వాడతారు. అదే విధంగా ఉగాది రోజునే పంచాంగ శ్రవణం, గోపూజ, ఏరువాక ఆచారాలను పాటిస్తారు.. అని అన్నారు . ఈ సందర్భంగా వారు నిర్వాకులు లడ్డూ అధ్యాయంలో ప్రజలకు పచ్చడి మరియు ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానికులు చక్రం, రాజు, మహేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు.