భక్తులు ఆర్టీసీ సేవలను తప్పక సద్వినియోగం చేసుకోవాలి :ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
పరకాల డిపో నుంచి 160 ప్రత్యేక బస్సు సర్వీసులు దేశంలోనే అతిపెద్ద గిరిజన ఆధ్యాత్మిక వేడుకగా పేరుగాంచిన మేడారం శ్రీ సమ్మక్క–సారలమ్మ మహాజాతరకు వెళ్లే భక్తులు ప్రభుత్వ ఆర్టీసీ సేవలను తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పిలుపునిచ్చారు.భక్తుల భద్రత, సౌకర్యం దృష్ట్యా ప్రభుత్వం అన్ని ముందస్తు చర్యలు చేపట్టిందని ఆయన స్పష్టం చేశారు.మంగళవారం భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలోని గణపురం, రేగొండ, చిట్యాల మండల కేంద్రాలలో మేడారం మహాజాతరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సు పాయింట్లను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పరకాల ఆర్టీసీ డిపో మేనేజర్, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ…పరకాల ఆర్టీసీ డిపో నుంచి మేడారం శ్రీ సమ్మక్క–సారలమ్మ మహాజాతరకు మొత్తం 160 ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు తెలిపారు.భక్తులు సులభంగా జాతరకు చేరుకునేందుకు గణపురం, రేగొండ, చిట్యాల మండలాల్లో ప్రత్యేక బస్సు పాయింట్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.రద్దీని నియంత్రించడంతో పాటు,ప్రమాదాలను నివారించేందుకు ప్రైవేటు వాహనాల కంటే ఆర్టీసీ సేవలే సురక్షితమని అన్నారు.మేడారం జాతరకు వెళ్లే మహిళా భక్తులకు ‘మహాలక్ష్మి’ పథకం వర్తిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.ఈ పథకం ద్వారా మహిళలు ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.ప్రభుత్వం అందిస్తున్న ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని, భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్మవార్లను దర్శించుకోవాలని ఆకాంక్షించారు.జాతర సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో,రవాణా విషయంలో భద్రత అత్యంత కీలకమని ఎమ్మెల్యే తెలిపారు. ట్రాఫిక్ సమస్యలు, వాహన ప్రమాదాలు తలెత్తకుండా ఉండాలంటే ఆర్టీసీ బస్సుల ద్వారానే ప్రయాణించాలని సూచించారు. జాతరకు వెళ్లి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు సురక్షితంగా తమ ఇళ్లకు చేరుకునేలా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందన్నారు.టేకుమట్ల మండల కేంద్రం నుంచి కూడా మేడారానికి ప్రత్యేక బస్సు సర్వీసులు నడిచేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా పరకాల డిపో మేనేజర్‌ను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కోరారు.భక్తుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అవసరమైతే అదనపు సర్వీసులు కూడా ఏర్పాటు చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, భూపాలపల్లి జిల్లా వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గుటోజు కిష్టయ్య, జిల్లా కాంగ్రెస్ నాయకులు మేకల బిక్షపతి,గండి తిరుపతి,మైస బిక్షపతి,ఉమ్మడి మండలాల అధ్యక్షుడు ఇప్ప కాయల నరసయ్య, ఓబీసీ జిల్లా నాయకులు పొనుగంటి వీరబ్రహ్మం,రేగొండ సర్పంచ్ మౌనిక అజయ్, ఉప సర్పంచ్ ఎలదండి నరేష్,మాజీ ఎంపీపీ పున్నం రవి,మాజీ ఎంపీటీసీ పట్టేమ్ శంకర్,స్థానిక ప్రజాప్రతినిధులు,పార్టీ నాయకులు,భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.