రూ.1.50 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కును లబ్ధిదారునికి అందజేత
ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక పెద్ద అండగా నిలుస్తోందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.సోమవారం మంజూరునగర్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రేగొండ మండల కేంద్రానికి చెందిన కురాకుల వెంకటేష్‌కు రూ.1,50,000 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కును ఆయన అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అనారోగ్యం, అత్యవసర వైద్య చికిత్సల సమయంలో పేద కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా రాష్ట్ర ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ ద్వారా తక్షణ సహాయం అందిస్తోందని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య రక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అవసరమైన ప్రతి సందర్భంలో అర్హులైన వారికి సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, సహాయ కార్యక్రమాలను ప్రజలు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల సమస్యల పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, లబ్ధిదారుని కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.