రేగొండ చెక్ పోస్ట్ వద్ద ఘోర ప్రమాదం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ చెక్‌పోస్టు వద్ద ఈరోజు మధ్యాహ్నం భయంకరమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.రెండు టిప్పర్ లారీలు ఒకదానికొకటి ఢీకొని పూర్తిగా నలిగిపోయిన ఈ ఘటన స్థానికంగా ఆందోళన కలిగించింది.రోడ్డుమీద అకస్మాత్తుగా గొర్రెల మందకు ఎదురైన ముందున్న టిప్పర్ డ్రైవర్ ఎమర్జెన్సీ బ్రేక్ వేయడంతో, వెనుక నుండి వేగంగా వస్తున్న మరో టిప్పర్ అదుపు కోల్పోయి ఢీకొంది. ఢీకొన్న ప్రభావం కారణంగా వెనుక టిప్పర్ క్యాబిన్ పూర్తిగా ధ్వంసమై డ్రైవర్ క్యాబిన్ లోపలే ఇరుక్కొని గాయాలతో అర్ధనాదాలు చేయసాగాడు.
సమయస్ఫూర్తితో రెస్క్యూ చేసిన పోలీసు సిబ్బంది
సమాచారం అందుకున్న వెంటనే రేగొండ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.ఎస్సైలు రాజేష్,సాయి త్రిలోక్ నాథ్ రెడ్డి జేసీబీ సహాయంతో దాదాపు ఒక గంటపాటు శ్రమించి,లారీని విడదీసి క్యాబిన్లో బిగుసుకుపోయిన డ్రైవర్‌ను ఎంతో జాగ్రత్తగా బయటకు తీశారు.రక్షణ చర్యల్లో కానిస్టేబుల్స్ మహేశ్,అరుణ్ కూడా కీలకపాత్ర పోషించారు.రక్షించబడిన డ్రైవర్‌ను అంబులెన్స్‌లో సమీప ఆసుపత్రికి తరలించారు.ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి విచారణ ప్రారంభించారు.