రోడ్డు భద్రతపై అవగాహనతోనే ప్రమాదాల నివారణ సాధ్యం
రోడ్డు భద్రతా మాసోత్సవంలో ఎస్సై సాకాపురం దివ్య స్పష్టం
రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న మూలమలుపులు,బ్రిడ్జిలు,ఇరుకైన మార్గాలలో వాహనాలు నడిపేటప్పుడు అవసరమైన జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలను అరికట్టవచ్చని ఎస్సై సాకాపురం దివ్య అన్నారు.రోడ్డు భద్రతా మాసోత్సవం కార్యక్రమంలో భాగంగా మండల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గోరి కొత్తపల్లి మండల పరిధిలో విస్తృత స్థాయిలో రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని ఎస్సై సాకాపురం దివ్య ఆధ్వర్యంలో నిర్వహించగా,గ్రామ సర్పంచ్ నిమ్మల శంకర్ సహకారంతో మండల వ్యాప్తంగా ప్రమాదాలకు అధికంగా గురయ్యే ప్రాంతాలను ప్రత్యక్షంగా పరిశీలించి గుర్తించారు.ముఖ్యంగా మండల పరిధిలోని నిజాంపల్లి మూలమలుపు, సుల్తాన్పూర్ బ్రిడ్జి, గోరి కొత్తపల్లి శ్మశాన వాటిక సమీపంలోని మూలమలుపు వంటి ప్రాంతాలను ఆక్సిడెంట్ జోన్లుగా గుర్తించి, అక్కడి పరిస్థితులను యువతతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా ఎస్సై దివ్య మాట్లాడుతూ, వేగ నియంత్రణ లేకపోవడం, నిర్లక్ష్య డ్రైవింగ్, హెల్మెట్ ధరించకపోవడం, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి కారణాల వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా యువత రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.మూలమలుపుల వద్ద వాహన వేగాన్ని తగ్గించడం, ఎదురుగా వచ్చే వాహనాలను గమనించడం, రాత్రి వేళల్లో హెడ్లైట్లను సరిగా వినియోగించడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని అన్నారు.మండల వ్యాప్తంగా గుర్తించిన ఆక్సిడెంట్ జోన్లలో ప్రమాదాలను శాశ్వతంగా నివారించేందుకు హెచ్చరిక బోర్డులు, సూచన బోర్డులు ఏర్పాటు చేయాలని, అవసరమైన చోట స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసేలా సంబంధిత శాఖ అధికారులను కోరినట్లు ఎస్సై దివ్య తెలిపారు.ప్రజల ప్రాణాల రక్షణే ప్రధాన లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తోందని ఆమె స్పష్టం చేశారు.రోడ్డు భద్రత విషయంలో పోలీస్ శాఖ ఒక్కటే కాకుండా ప్రజల సహకారం కూడా అత్యంత అవసరమని ఎస్సై దివ్య పేర్కొన్నారు. ప్రతి వాహనదారుడు బాధ్యతాయుతంగా వాహనాలు నడిపితేనే ప్రమాదాలను తగ్గించవచ్చని తెలిపారు.గ్రామ స్థాయిలో రోడ్డు భద్రతపై అవగాహన పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తామని ఆమె చెప్పారు.ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ అజయ్, వార్డు సభ్యులు తుమ్మరపల్లి వేణు, కారోబార్ నాగరాజు, స్నేహ యూత్ అధ్యక్షుడు ఆవుల రాజు, స్నేహ యూత్ ఉపాధ్యక్షుడు లింగంపల్లి కృష్ణ, నామాల వినయ్, వడ్ల ప్రకాష్‌తో పాటు పలువురు యువకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొని రోడ్డు భద్రతపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరాన్ని గుర్తించారు