


ఈ69 న్యూస్ జయశంకర్ భూపాలపల్లి రేగొండ
విద్యా వైద్యంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. బుధవారం రేగొండ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతి బాపూలే గురుకుల పాఠశాల, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొదట మహాత్మా జ్యోతి బాపూలే గురుకుల పాఠశాలలో కిచెన్ షెడ్, స్టోర్ రూమ్, క్లాస్ రూములను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ప్రిన్సిపాల్ అపర్ణకు సూచించారు. విద్యార్థులకు వ్యక్తిగత శుభ్రతపై అవగాహన కల్పించాలని తెలిపారు. వంటకు ఉపయోగించే కూరగాయలు, పప్పులు, మాంసం నాణ్యత పాటించాలని అన్నారు. ఏదేనిన సమస్య ఏర్పడితే వెంటనే పై అధికారులకు సమాచారం అందించాలని విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలిగిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గురుకుల పాఠశాలలో కూరగాయలు నిల్వ ఉంచడానికి ప్రత్యేక ర్యాక్ లు అందిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. కాసేపు జిల్లా కలెక్టర్ విద్యార్థులతో ముచ్చటించారు.
అనంతరం ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రోగుల హాజరు నమోదు రిజిస్టర్ పరిశీలించారు. ఎలాంటి జబ్బులతో ఆసుపత్రికి వస్తున్నారు అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యసేవలందిస్తేనే ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం పెరుగుతుందని అన్నారు. ఆసుపత్రి ల్యాబ్, ఫార్మసీ, ఇన్ పేషెంట్ వార్డులను పరిశీలించి సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా లాంటి వ్యాధులు బారిన పడిన వారి వివరాలు వెంటనే పై అధికారులకు తెలుపాలని సూచించారు. గ్రామాలలో ప్రజలకు సీజనల్ వ్యాధుల నియంత్రణకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. వ్యాధులు ప్రబలిన ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించి తగు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అన్ని ఆసుపత్రుల్లో అవసరమైన వ్యాక్సిన్లు, మందులు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి సునీల్ కుమార్, ఇంచార్జి డిఎంహెచ్ఓ డా శ్రీదేవి, ఆసుపత్రి వైద్యులు
డా హిమబిందు, తహసిల్దార్ శ్వేత, ఎంపీడీవో వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.