
యాటల సోమన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
ఈలోగా జీ.వో. 814 ప్రకారం మినిమమ్ టైం స్కేల్ లాస్ట్ గ్రేడ్ సర్వీస్ వేతనం రూ.19000/- చెల్లించాలి.
– సిఐటియు
తెలంగాణలోని 192 వ్యవసాయ మార్కెట్ కమిటీలలో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పద్దతిన సుమారు 1,200 మంది సెక్యూరిటీ గార్డులు గత 30 సం||రాల నుండి (1994) మార్కెట్ యార్డులలో, చెక్‌పోస్టులలో, కార్యాలయాలల్లో విధులు నిర్వహిస్తున్నాము. మార్కెట్ యార్డులలో రైతుల సరుకులను రక్షిస్తూ, వేలం పాటలు నిర్వహించడం, కార్యాలయంలో క్లరికల్ పనులు చేస్తున్నాము. మార్కెట్ చెక్‌పోస్టులలో వ్యవసాయ దినుసుల రవాణా వాహనాలను ఆపి తనిఖీ చేసి స్వయంగా ట్యాబ్ ద్వారా లేదా కంప్యూటర్ ద్వారా నేరుగా ఆన్లైన్ రశీదు జారీ చేసి, మార్కెట్ ఫీజు వసూలు చేసి ప్రభుత్వ ఆదాయం పెంచడంలో రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డుల పట్ల ప్రభుత్వం నిర్లక్షంగా వ్యవహరిస్తున్నది. మినిమమ్ టైం స్కేల్ లాస్ట్ గ్రేడ్ సర్వీస్ వేతనం రూ.19,000/-లు చెల్లించాలని, ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి నేరుగా కమిటీల ద్వారా వేతనాలు చెల్లించుట, ఇతర సమస్యలు పరిష్కారించాలని కోరుతూ నేడు (2025 మార్చి 26న) ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించాము.
ఈ ధర్నాకు ముఖ్యఅతిధిగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, తెలంగాణ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు జె. వెంకటేష్, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్, గ్రామపంచాయతీ యూనియన్ నాయకులూ పి సుధాకర్, రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల సాంబయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాటల సోమన్నలు ప్రసగించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు పి వెంకన్న, కార్యదర్శులు వై రామాంజయ్య , జి. వెంకటస్వామి, సుధారసం రమేష్, రాష్ట్ర నాయకులు ఎండి యాకుబ్ అలీ, ఎం రవీందర్, చందా సతీష్, జె. శోభారాణి, బోట్ల వెంకటేష్, అభిషేక్, బి. శ్రీనివాస్, ప్రవీణ్,కె. అశోక్, జె. నరేష్, ఏ. నర్సోజి, ఎన్ చంద్రయ్య లతోపాటు వివిధ మార్కెట్ల సెక్యూరిటీ గార్డ్స్ పాల్గొన్నారు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రభుత్వం 2016లో పిఆర్సిలో లాస్ట్ గ్రేడ్ సర్వీస్ వేతనం రూ.13,000/-లు చెల్లించాల్సి ఉండగా రూ. 12,000/-లు మాత్రమే చెల్లించింది. దీంతో సెక్యూరిటీ గార్డులకు తీవ్ర అన్యాయం జరిగింది. రెండవ పిఆర్సిలో మినిమమ్ టైం స్కేల్ లాస్ట్ గ్రేడ్ సర్వీస్ మినిమం బేసిక్ రూ.19,000/-లు చెల్లించాల్సి ఉండగా 30% పిఆర్సి పేరుతో రూ.12,000/-లపై 30%తో రూ.3,600/- లు కలిపి రూ.15,600/- లు చేసి రెండోసారి తీవ్ర అన్యాయం చేశారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని అగ్రికల్చర్ మార్కెటింగ్ & కో-ఆపరేటివ్ డిపార్ట్మెంట్ ద్వారా జిఓఆరి నెం:814 తేది: 7/6/2013 మినిమమ్ టైం స్కేల్ లాస్ట్ గ్రేడ్ సర్వీస్ (అటెండర్, వాచ్మెన్) వేతనాలు ఇచ్చారు. రూ.6,700/-లు చెల్లించాలని జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం వేతనాలు పొందాము. పెరిగిన ధరలకునుగుణంగా సెక్యూరిటీ గార్డులకు కనీస వేతనం రూ. 26,000/-లుగా నిర్ణయించాలి. ఈలోగా జీవో 814 ప్రకారం టైం స్కేల్ లాస్ట్ గ్రేడ్ సర్వీస్ వేతనం రూ.19,000/-లు ఇవ్వాలని ఈ ధర్నా ద్వారా డిమాండ్ చేస్తున్నాము.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకైనా సెక్యూరిటీ గార్డుల బతుకులు బాగుపడుతాయానుకుంటే ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉన్న చందంగా వుంది. ఈ సంవత్సర కాలంలో సమస్యల పరిష్కారం చేయాలని, మంత్రులకు, అధికారులకు అనేక ధరఖాస్తులు ఇచ్చిన్నప్పటికీ అతీగతీలేదు.
థర్డ్ పార్టీ ఏజెన్సీ ద్వారా పని చేయడం వలన వచ్చే వేతనాలు ప్రతినెలా సక్రమంగా రావడం లేదు. ఏజెన్సీలు ఇపిఎఫ్ సరిగ్గా చెల్లించపోవడం, సంవత్సరంలో ప్రతినెలా సక్రమంగా చెల్లింపులు లేకపోవడం వలన వడ్డీ సరిగా జమకాక పిఎఫ్ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. ఇఎస్ఐ కూడా సక్రమంగా ఎజెన్సీలు చెల్లించకపోవడంలో సెక్యూరిటీగార్డులు అనారోగ్యానికి గురైనప్పుడు వైద్య సౌకర్యాలు అందక ఇబ్బందుపడుతున్నారు. ఎజెన్సీ వ్యవస్థను రద్దు చేసి, నేరుగా మార్కెట్ కమిటీల నుండే వేతనాలు, ఇపిఎఫ్, ఇఎస్ఐ చెల్లించాలి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అక్కడి కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సాధారణ మరణానికి రూ.2 లక్షలు, ప్రమాద మరణానికి రూ.5 లక్షలు ఎక్స్రేషియో, మహిళలకు 180 రోజుల ప్రసూతి సెలవులు ఇచ్చి వేతనం జీ.వో. ఎంఎస్ నెం: 25 ద్వారా చెల్లిస్తున్నది. అదే పద్ధతిలో తెలంగాణ పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులైన సెక్యూరిటీ గార్డులకు కూడా చెల్లించి ఆదుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చనిపోయిన కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు దహన ఖర్చుల నిమిత్తం రూ.15,000/- లు చెల్లించాలని జి.వో.నెం: 119 ద్వారా చెల్లిస్తున్నది. మన రాష్ట్రంలో సెక్యూరిటీ గార్డులకు దహనసంస్కారాలకు రూ.20,000/- చెల్లించాని ధర్నా డిమాండ్ చేస్తున్నది.
కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పని చేస్తున్నప్పటికీ 61 సం॥రాల వయస్సు తరువాత రిటైర్మెంట్ అయితే ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వకపోవడంతో రిటైర్మెంట్ అయిన తర్వాత కుటుంబ జీవనం కష్టంగా మారుతుంది. రిటైర్మెంట్ అయిన సెక్యూరిటీ గార్డులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.5 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వాని డిమాండ్ చేస్తున్నాము. వివిధ వ్యవసాయ మార్కెట్ కమిటీలలో ఖాళీగా ఉన్న అటెండర్ నుండి మొదలుకొని సూపర్వైజర్ వరకు వివిధ పోస్టులుగా ఖాళీగా వున్నాయి. ఈ పోస్టుల్లో గత 30 సం||రాలుగా పని చేస్తున్న వారి సర్వీస్, విద్యార్హత ప్రకారం సెక్యూరిటీ గార్డులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తున్నాము. వేతనాలు కానీ, ఇపిఎఫ్, ఇఎస్ఐ, తదితర ఖర్చులు వ్యవసాయ మార్కెట్ కమిటీల ఆదాయం నుండే చెల్లిస్తున్నారు. కావున ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థిక భారం పడదని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము.