శాశ్వత ఆధార్ నమోదు కేంద్రం ప్రారంభం
రేగొండ మండల కేంద్రంలో ప్రజలకు ఆధార్ సంబంధిత సేవలు మరింత సులభంగా అందుబాటులోకి రానున్నాయి.మండల ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన శాశ్వత ఆధార్ నమోదు కేంద్రాన్ని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు (జీఎస్సార్) గురువారం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆధార్ కార్డు ప్రతి పౌరుడికి అత్యంత కీలకమైన గుర్తింపు పత్రమని పేర్కొన్నారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ పౌర సేవలను పొందేందుకు ఆధార్ అనివార్యమని తెలిపారు.ఇప్పటివరకు ఆధార్ నమోదు లేదా సవరణల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని, శాశ్వత కేంద్రం ఏర్పాటు వల్ల రేగొండ మండల ప్రజలకు ఈ సమస్య తీరిందన్నారుఈ కేంద్రం ద్వారా కొత్త ఆధార్ నమోదు, చిరునామా మార్పు, ఫోన్ నెంబర్ అప్డేట్, బయోమెట్రిక్ సవరణ వంటి సేవలు ఒకేచోట అందుబాటులో ఉంటాయని తెలిపారు.ముఖ్యంగా వృద్ధులు,మహిళలు,విద్యార్థులు,రైతులకు ఈ కేంద్రం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఏఎంసీ చైర్మన్ గూటోజు కిష్టయ్య,రేగొండ గ్రామ సర్పంచ్ వారణాసి మౌనిక – అంజి,మండల అధికారులు,ప్రజాప్రతినిధులు,స్థానిక నాయకులు పాల్గొన్నారు.