
ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి డిమాండ్
భూమిపై మహిళలకు హక్కు కల్పించాలి
మగవాళ్ళతో సమానంగా సమాన పనికి సమాన వేతనం చెల్లించారు
పని ప్రదేశంలో మహిళలకు భద్రత కరువు
ఆహార భద్రతకు చర్యలు చేపట్టాలి
చట్ట సభలలో 33% రిజర్వేషన్లు అమలు చేయాలి
వ్యవసాయ మహిళా కూలీల జిల్లా సదస్సులో ఆధ్వర్యంలో ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి డిమాండ్
తాత్కాలిక ప్రయోజనం కల్పించే సంక్షేమ పథకాలు కాదు కావాల్సింది బతుకు మార్చే విధానాలను పాలకవర్గాలు తేవాలని , భూమిపైన మహిళలకు హక్కు కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని , పని ప్రదేశంలో మహిళలకు రక్షణ కల్పించాలని, చట్ట సభలలో 33% రిజర్వేషన్లు మహిళలకు అమలు చేయాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి డిమాండ్ చేశారు
హన్మకొండ జిల్లా కేంద్రంలో అంబాల స్వరూప అధ్యక్షతన జరిగిన తెలంగాణ వ్యవసాయ మహిళా కూలీల జిల్లా సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన లక్ష్మి మాట్లాడుతూ గ్రామీణ వ్యవసాయ ఉత్పత్తి రంగంలో మహిళల శ్రమ 78 శాతంగా ఉందని చెప్పారు. కానీ 76 ఏళ్ల స్వతంత్ర భారతంలో వారసత్వ ఆస్తిపై మహిళలకు హక్కు కల్పించే దానిలో పాలకులు విఫలం అయ్యారు అని అన్నారు. గ్రామీణ వ్యవసాయ కార్మికులకు నిలువ నీడకు 120 గజాల ఇండ్ల స్థలం కావాలని అడిగితే భూమి లేదు అని చెప్పే పాలకులు బడా కార్పొరేట్ కంపెనీలకు వందలాది ఎకరాలను అప్పగిస్తున్నారని చెప్పారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రభుత్వ భూములను ఆక్రమించి వెంచర్స్ వేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడానికి సిద్ధపడని పాలకులు నివాసానికి గుడిసెలు వేసుకున్న వారిపై బుల్డోజర్లు పెట్టి నిర్బంధంగా కూల్చి వేస్తున్నారని చెప్పారు. ఇల్లు మహిళల ఆత్మగౌరవం అని చెప్పారు. వామపక్షాల ఒత్తిడి మేరకు పార్లమెంట్లో తెచ్చిన ఆహార భద్రత చట్టం, గ్రామీణ ఉపాధి హామీ చట్టాల అమలను కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం నీరు కారుస్తుంది అన్నారు. ఆకాశాన్ని అంటుతున్న నిత్యవసర వస్తువుల ధరలను నియంత్రణ చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం అయింది అన్నారు. కనీస వేతనం 26000 ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పిన కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అన్నారు. కేరళలో ఉన్న వామపక్ష ప్రభుత్వం పౌరసరఫరాల దుకాణాల నుండి 14 రకాల సరుకులు ఇస్తుంటే కేంద్ర ప్రభుత్వం మనిషికి ఐదు కేజీల బియ్యం ఇచ్చి చేతులు దులుపుకుంటుంది అన్నారు. పౌష్టిక ఆహారం అందక మహిళలలో రక్తహీనత రుగ్మతలు పెరుగుతున్నాయని చెప్పారు . మహిళలపై పని ప్రదేశంలో అత్యాచారాలు పెరిగాయని వీటిని అరికట్టాల్సిన పాలకులు నిందితులకు అండగా నిలబడుతుంది, వారికి శిక్షణ పడకుండా కాపాడుతుందని, శిక్షలు పడిన వారిని బయటికి తీసుకొచ్చి ఊరేగింపులు చేస్తున్నారని సభ్య సమాజం తలదించుకునే చర్య అని అన్నారు. అత్యాచారాల ఘటనలకు పాల్పడే వారికి కఠినమైన శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ఉపాధి పనిని 200 రోజులకు , రోజు కూలి 800 రూపాయలకు పెంచాలని దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతుంటే పెంచడానికి సిద్ధపడలేదని చెప్పారు. పట్టణ పేదలకు మనందరం ఈ పనిని విస్తరింప చేయాలని , నిధులను పెంచాలని డిమాండ్ చేశారు. మహిళా కూలీల రాష్ట్ర కన్వీనర్ బొప్పని పద్మ మాట్లాడుతూ మహిళా సాధికారత పేరుతో మాటలే చెప్తున్నారు తప్ప ఆచరణ లేదన్నారు. మహిళలను పిల్లలను కనే యంత్రం లాగా బిజెపి పాలకులు భావిస్తున్నారని చెప్పారు. మన ధర్మ శాస్త్రాన్ని అమలు చేయడం కోసం సిద్ధపడుతున్నారని అన్నారు. పిచ్చలవిడిగా మద్యాన్ని ప్రోత్సహిస్తున్నారని, వరకట్న వేధింపులు, హత్యలు, అత్యాచారాలు పెరుగుతున్న నియంత్రించడం లేదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు 2500 రూపాయలు, మనం భూమిలేని వ్యవసాయ కార్మికులకు 12 వేల రూపాయలు, ఇండ్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పారు. పట్టణ ప్రాంతాలలో ఉపాధి పనిని విస్తరింప చేస్తామన్న హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సదస్సులో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి ప్రసాద్ , జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గుమ్మడి రాజుల రాములు, సారంపల్లి వాసుదేవరెడ్డి , లోకిని స్వరూప, వేలు రజిత , రమ తదితరులు పాల్గొన్నారు