ఈ69 న్యూస్ ఏలూరు
సర్వ ధర్మాల అవతార పురుషులను పరస్పరం గౌరవించుకున్నప్పుడే ప్రపంచంలో శాంతి నెలకొంటుందని అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ జాతీయ ప్రతినిధి కె.తారీక్ అహ్మద్ అన్నారు.ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.ప్రపంచం నేడు చాలా క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నదని,తాము ప్రపంచాన్ని శాంతి వైపు నడిపించడం తమ కర్తవ్యంగా భావించి,క్రమం తప్పకుండా భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా శాంతి సౌభ్రాతృత్వాన్ని ప్రోత్సహించడానికి శాంతి సమ్మేళనాలు,సెమినార్లు,చర్చాగోష్టి మరియు విద్యావేత్తల,మేధావుల సలహాలు తీసుకొని ప్రపంచ శాంతి స్థాపనకై అనేక రకాల కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని,సర్వ ధర్మాల అవతార పురుషులను పరస్పరం గౌరవించుకున్నప్పుడే ప్రపంచంలో శాంతి స్థాపించవచ్చునని అన్నారు.అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ స్ధాపకులు హజ్రత్ మిర్జా గులామ్ అహ్మద్ అలైహిస్సలాం 1889వ సంత్సరంలో
హజ్రత్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు
అలైహివ సల్లం చేసిన భవిష్యవాణి ప్రకారం ఈ అంతిమ కాలంలో అవతరించే వాగ్దాత్త మసీహ్ తానే అని
ప్రకటించారన్నారు.అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ ప్రపంచ అధినేత ఐదవ ఉత్తరాదికారి హజ్రత్ మిర్జా మస్రూర్ అహ్మద్ వివిధ దేశాల పార్లమెంటుల్లో అధికారం ఉగ్రవాదం విద్వేషమనే గోడలను నిర్మించగలవే కానీ జన హృదయాలను గెల్చుకోలేవు అనే అంశం పై ప్రసంగాలు చేస్తూ ప్రపంచ శాంతి స్థాపన కొరకు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.అందరిని ప్రేమించు ఎవ్వరినీ ద్వేశించకు అనే నినాదంతో హ్యూమానిటీ ఫస్ట్ శాఖ ఆధ్వర్యంలో మానవ సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతున్నదన్నారు.కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఇంచార్జి ఎమ్.ఏ.జాఫర్ ఖాన్,జిల్లా యువజన అధ్యక్షులు మునవ్వర్ అహ్మద్ మస్తాన్,ఆంధ్రప్రదేశ్
ప్రజా సంబంధాల ప్రతినిధి ముహమ్మద్ జావేద్ అహ్మద్ పాషా,వృద్ధుల శాఖ జిల్లా అధ్యక్షులు రిజ్వాన్ సలీమ్ పాల్గొన్నారు.