
సూర్యాపేట జిల్లాలోని బీబీ గూడెం శివారులో నిన్న సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన తొర్రూరు మండలం కంటయ్యపాలెంకు చెందిన గడ్డం రవీందర్ (34),ఆయన భార్య రేణుక (28),కుమార్తె రిషిత (8)ల మరణం గ్రామాన్ని విషాదంలో ముంచింది.ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతికి లోనైన పాలకుర్తి శాసన సభ్యురాలు యశస్విని రెడ్డి అసెంబ్లీ సమావేశాల మధ్యలోనే నేరుగా కంటయ్యపాలెం గ్రామానికి చేరుకున్నారు.మృతుల పార్థివ దేహాలను సందర్శించి,వారికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్ధిక సహాయం అందజేసి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ..ఒకే కుటుంబం ఇలా రోడ్డుప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం ఎంతో హృదయవిదారకరమైన విషయం.వారి మరణం పట్ల నాకు ఎంతో బాధ కలిగింది.ఈ కుటుంబానికి జరిగిన నష్టాన్ని ఏమి భర్తీ చేయలేం.వీరి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా నిలబడతాం.బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.ఈ సందర్బంగా వారు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి కుటుంబ సభ్యులకు మద్దతుగా నిలిచి,గ్రామ ప్రజలకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన పెంచుకోవాలని సూచనలు చేశారు.గ్రామస్థులు కూడా ఎమ్మెల్యే స్పందనను అభినందిస్తూ,ఈ దుర్ఘటనకు బాధ్యత వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ సంఘటన గ్రామం మొత్తాన్ని కలచివేసిన విషాద ఘటనగా మారింది.యశస్విని రెడ్డి ప్రత్యక్షంగా వచ్చి కుటుంబాన్ని పరామర్శించడం తో వారికి కొంత భరోసా లభించినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు.