
ఈ69న్యూస్ వరంగల్,జూలై 29
రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు (వెనుకబడిన తరగతులకు) కనీసం 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి ప్రభుత్వాన్ని,అన్ని రాజకీయ పార్టీలను గట్టిగా డిమాండ్ చేశారు.వరంగల్ నగరంలో పత్రికా సమావేశంలో మాట్లాడిన ఆయన,రాష్ట్రంలోని బీసీ వర్గాలు పౌరసేవలు,రాజకీయాలలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ,వారికి న్యాయమైన ప్రాతినిధ్యం కల్పించడంలో అధికార,విపక్ష పార్టీలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు.శ్రీహరి మాట్లాడుతూ..బీసీలను కేవలం ఓటు బ్యాంకులుగా మాత్రమే చూస్తున్నారు.ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం,తర్వాత మర్చిపోవడం అధికారి పార్టీల ధోరణి అయిపోయింది.ఈసారి బీసీ సమాజం మోసపోవడం లేదు.రాజకీయ పార్టీలన్నీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ప్రకటించినప్పుడే మేము మద్దతు ఇవ్వడం జరుగుతుంది అని హెచ్చరించారు.ఇప్పటికే పలు రాష్ట్రాల్లో బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతున్నదని గుర్తుచేసిన ఆయన,తెలంగాణలోనూ అదే తరహాలో ముందడుగు వేయాలని ప్రభుత్వాన్ని కోరారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు బీసీల సామూహిక శక్తిని చాటిచెప్పే అవకాశమని పేర్కొన్నారు.బీసీ సంఘాలు,నేతలు ఐక్యంగా ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు,బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.