అక్రమ గుడుంబా తయారీపై పోలీసుల మెరుపు దాడులు
భూపాలపల్లి జిల్లా మల్హర్రావు మండలం కొయ్యూరు పరిధిలో అక్రమ గుడుంబా తయారీపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు.జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ ప్రత్యేక చర్యల్లో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.పోలీసుల వివరాల ప్రకారం,మల్హర్రావు మండలం కొండంపేట గ్రామానికి చెందిన కొరకాని సమ్మయ్య (40) అక్రమంగా గుడుంబా తయారు చేస్తుండగా పట్టుబడ్డాడు.అతని వద్ద నుండి సుమారు 20 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు.అదనంగా అక్కడే తయారీకి సిద్ధంగా ఉంచిన సుమారు 600 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు.అదేవిధంగా అదే గ్రామానికి చెందిన చీర్ల రాజేశ్వరి (50) కూడా గుడుంబా తయారీలో నిమగ్నమై ఉండగా పోలీసులు పట్టుకున్నారు.ఆమె వద్ద నుండి 10 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకొని, సుమారు 50 లీటర్ల బెల్లం పానకాన్ని నాశనం చేశారు.ఈ ఘటనలపై ఇద్దరిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.అక్రమ గుడుంబా తయారీ,విక్రయాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు.ఈ సందర్భంగా కొయ్యూరు ఎస్ఐ నరేష్ మాట్లాడుతూ,గ్రామాల్లో జరుగుతున్న ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండి వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.ప్రజల సహకారంతోనే అక్రమ కార్యకలాపాలను పూర్తిగా నిర్మూలించగలమని ఆయన పేర్కొన్నారు.