ప్రజా సంక్షేమ వేదిక రోడ్డు భద్రతా పోస్టర్లను ఆవిష్కరించిన మంత్రి సీతక్క
దేశంలో, రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా “ప్రజా సంక్షేమ వేదిక” సామాజిక సేవా సంస్థ రూపొందించిన ప్రత్యేక అవగాహన పోస్టర్లను తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ (సీతక్క) బుధవారం తన అధికారిక క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. సమాజంలో రోడ్డు భద్రతపై ప్రజలకు, వాహనదారులకు విస్తృత అవగాహన కల్పించేందుకు ఈ పోస్టర్లను ముద్రించడం అభినందనీయమని మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరి జీవితం ఎంతో విలువైందని, ప్రయాణాలు చేసే సమయంలో వాహనదారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యధిక ప్రమాదాలు మానవ తప్పిదాల వల్లే జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ, ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వారు తప్పనిసరిగా నాణ్యమైన హెల్మెట్ ధరించాలని, అలాగే కార్లలో ప్రయాణించే వారు విధిగా సీటు బెల్టు పెట్టుకోవాలని స్పష్టం చేశారు. వాహనాలు నడిపేటప్పుడు సెల్ ఫోన్ మాట్లాడటం అత్యంత ప్రమాదకరమని, అది మన ప్రాణాలతో పాటు ఎదుటివారి ప్రాణాలను కూడా బలితీసుకుంటుందని హెచ్చరించారు.ముఖ్యంగా యువత మద్యం సేవించి ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రైవింగ్ చేయకూడదని (డ్రంక్ అండ్ డ్రైవ్), వేగ పరిమితిని దాటకుండా జాగ్రత్తలు వహించాలని పిలుపునిచ్చారు.ప్రయాణాల్లో ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను స్వచ్ఛందంగా పాటించి,సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ప్రజలకు సూచించారు. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తూ, రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రజా సంక్షేమ వేదిక సామాజిక సేవా సంస్థ బృందాన్ని, వారి సామాజిక బాధ్యతను ఈ సందర్భంగా మంత్రి సీతక్క ప్రత్యేకంగా అభినందించి, ప్రభుత్వ పరంగా పూర్తి మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ ప్రతిష్టాత్మక పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రజా సంక్షేమ వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు మడికొండ రఘుపతి, ములుగు జెడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి, ములుగు మున్సిపల్ చైర్పర్సన్ చంద్రకళ, వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు, ప్రజా సంక్షేమ వేదిక ముఖ్య నాయకులు,ప్రతినిధులు,స్వచ్ఛంద సంస్థల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.