రైతు వేదికలో ప్రకృతి వ్యవసాయ శిక్షణకు విశేష స్పందన
భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని చిట్యాల గ్రామ రైతు వేదికలో ప్రకృతి వ్యవసాయం (సేంద్రియ సాగు)పై అవగాహన, శిక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహక కార్యక్రమం కింద నిర్వహించిన ఈ శిక్షణకు రైతులు, కృషి సఖులు, గ్రామ ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరై విశేష ఆసక్తి కనబరిచారు.రైతు వేదిక ప్రాంగణం సందడిగా మారి,కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది.ఈ కార్యక్రమంలో చిట్యాల మార్కెట్ కమిటీ ఛైర్మన్ గుమ్మడి శ్రీదేవి,మండల వ్యవసాయ అధికారి సి.హెచ్. శ్రీనివాస్ రెడ్డి,వ్యవసాయ విస్తరణ అధికారి చిర్ర సన్నీ,స్వచ్ఛంద సంస్థ జిల్లా నోడల్ అధికారి మణికుమార్,నవాబుపేట గ్రామ సర్పంచ్ పర్లపెల్లి రవి తదితరులు పాల్గొన్నారు.అలాగే కృషి సఖులు పింగిలి జ్యోతి,మోత్కూరి గీత,నవాబుపేట,చింతకుంట రామయ్యపల్లి గ్రామాల సర్పంచ్‌లు,ఉప సర్పంచ్‌లు కూడా పాల్గొని రైతులను ప్రోత్సహించారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ,ప్రస్తుత వ్యవసాయంలో అధికంగా రసాయన ఎరువులు,పురుగుమందుల వినియోగం వల్ల నేల సారవంతత తగ్గిపోవడంతో పాటు పంటల నాణ్యత దెబ్బతింటోందని,రైతుల ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావాలు పడుతున్నాయని వివరించారు.ఈ సమస్యలను అధిగమించేందుకు ప్రకృతి వ్యవసాయం ఉత్తమ మార్గమని సూచిస్తూ,రైతులు క్రమంగా రసాయనాల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ పద్ధతులను అనుసరించాలని కోరారు.శిక్షణలో భాగంగా జీవామృతం,నీమాస్త్రం,అగ్న్యాస్త్రం వంటి సేంద్రియ ద్రావణాల తయారీ విధానాలను ప్రాక్టికల్‌గా చూపించి వివరించారు.ఈ ద్రావణాలు పంటలను పురుగుల నుండి రక్షించడంతో పాటు నేలలో సూక్ష్మజీవుల పెరుగుదలను పెంచి,నేల సారాన్ని మెరుగుపరుస్తాయని తెలిపారు.దీని ద్వారా పంటల దిగుబడి పెరగడంతో పాటు నాణ్యత కూడా మెరుగుపడుతుందని చెప్పారు.తక్కువ ఖర్చుతో అధిక లాభాలు పొందేందుకు ప్రకృతి వ్యవసాయం రైతులకు ఎంతో ఉపయోగకరమని వివరించారు.కృషి సఖులకు ప్రత్యేకంగా మార్గదర్శకాలు అందిస్తూ,గ్రామ స్థాయిలో రైతులకు అవగాహన కల్పించడంలో వారు కీలక పాత్ర పోషించాలని అధికారులు సూచించారు.రైతులు పరస్పరం తమ అనుభవాలను పంచుకుంటూ ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించాలని,తద్వారా గ్రామాల్లో సేంద్రియ సాగు విస్తరణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు.కార్యక్రమం ముగింపు సందర్భంగా రైతులకు ఎన్ఏంఎన్ఎఫ్ కిట్లను పంపిణీ చేశారు.ఈ కిట్లలో కరపత్రం,టోపీ,నోట్‌ప్యాడ్,పెన్,గుర్తింపు కార్డు,క్యాలెండర్,జ్యూట్ బ్యాగ్ వంటి సామగ్రి ఉండగా,ఇవి రైతులకు శిక్షణలో నేర్చుకున్న అంశాలను ప్రాక్టికల్‌గా అమలు చేయడంలో ఉపయోగపడతాయని తెలిపారు.ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా రైతుల్లో ప్రకృతి వ్యవసాయం పట్ల చైతన్యం పెంపొందడంతో పాటు,భవిష్యత్తులో సేంద్రియ సాగును మరింత విస్తృతంగా ప్రోత్సహించేందుకు అధికారులు కట్టుబడి ఉన్నట్లు వెల్లడించారు. కార్యక్రమం విజయవంతంగా సాగడంతో పాల్గొన్న రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తూ, ఇలాంటి శిక్షణలు మరింతగా నిర్వహించాలని కోరారు.