యోగా సాధనతో శారీరక-మానసిక ఆరోగ్యం సాధ్యం
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఇల్లందు క్లబ్లో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో యోగా అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య వారోత్సవాలు మరియు హోమియోపతి డే పురస్కరించుకుని ఈ ప్రత్యేక యోగా సెషన్‌ను నిర్వహించారు.కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ముఖ్య అతిథిగా హాజరై యోగా సాధన ప్రాముఖ్యతను వివరించారు.కార్యక్రమం ప్రారంభంలో హోమియోపతి వైద్య విధాన పితామహుడు డా. క్రిస్టియన్ ఫ్రెడ్రిక్ సామ్యూయెల్ హానెమాన్) 271వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ,ప్రస్తుత కాలంలో వేగవంతమైన జీవన శైలి,పనిభారం కారణంగా ప్రజలు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని,అలాంటి పరిస్థితుల్లో యోగా సాధన ఎంతో ఉపయుక్తమని తెలిపారు.యోగా కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాకుండా మనసుకు ప్రశాంతతను ఇచ్చే సమగ్ర సాధనమని పేర్కొన్నారు.ప్రతిరోజూ కొద్దిసేపు యోగాను ఆచరిస్తే శారీరక దృఢత్వం పెరగడంతో పాటు మానసిక స్థిరత్వం కూడా సాధ్యమవుతుందని చెప్పారు.ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకుని క్రమం తప్పకుండా సాధన చేయాలని సూచించారు.ఇలాంటి ఆరోగ్య అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ఆరోగ్యంపై చైతన్యం పెంపొందించడంతో పాటు ఆయుష్ సేవలను గ్రామీణ ప్రాంతాల వరకు విస్తరించడానికి ఇది కీలకంగా ఉపయోగపడుతుందని కలెక్టర్ వివరించారు.ప్రభుత్వం ప్రజల ఆరోగ్య రక్షణకు ప్రాధాన్యతనిస్తూ ఇటువంటి కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తోందని తెలిపారు.జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ మాట్లాడుతూ,ఆరోగ్య వారోత్సవాల నిర్వహణ ద్వారా ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడమే లక్ష్యమని పేర్కొన్నారు.విద్యార్థులు చిన్న వయసు నుంచే ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని, క్రమశిక్షణతో జీవనం సాగించాలని సూచించారు.యోగా సాధన ద్వారా ఒత్తిడి తగ్గి ప్రశాంత జీవనం సాధ్యమవుతుందని చెప్పారు.ఆయుష్ వైద్య విధానాల ప్రాముఖ్యతను కూడా ఈ సందర్భంగా వివరించారు.యోగా సెషన్లో యోగా ఇన్స్ట్రక్టర్లు పలు ఆసనాలు,ప్రాణాయామ పద్ధతులను ప్రదర్శించి పాల్గొన్న వారికి ప్రత్యక్షంగా శిక్షణ ఇచ్చారు.నర్సింగ్ విద్యార్థులు,యువత,మహిళలు,స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొని యోగా సాధన చేశారు.కార్యక్రమం అనంతరం ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపును నిర్వహించి,ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించారు.ఆయుష్ వైద్యులు వివిధ రకాల ఆరోగ్య సమస్యలపై సలహాలు ఇచ్చి, అవసరమైన మందులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమాన్ని ఆయుష్ వైద్యురాలు డా. తనూజా రాణి ఆధ్వర్యంలో సమర్థవంతంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, మునిసిపల్ చైర్మన్ బుర్ర కొమ్మరయ్య, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.మధుసూదన్, డిపిఆర్వో శ్రీనివాస్, ఆర్డీఓ హరికృష్ణ, తహసీల్దార్ లక్ష్మీ రాజయ్య, రెడ్ క్రాస్ చైర్మన్ శ్రీనివాస్, కౌన్సిలర్ అప్పం కిషన్, ఆయుష్ జిల్లా వైద్య బృందం, యోగా ఇన్స్ట్రక్టర్లు,నర్సింగ్ విద్యార్థులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.మొత్తంగా ఈ కార్యక్రమం ద్వారా యోగా సాధన ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన పెరిగి, ఆరోగ్యకరమైన జీవనశైలికి ప్రోత్సాహం లభించిందని అధికారులు తెలిపారు.