ప్రజా సంక్షేమం,గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
ప్రజా సంక్షేమం,గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి టేకుమట్ల
జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం పంగిడిపల్లి గ్రామంలో సోమవారం నిర్వహించిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” గ్రామసభ అత్యంత విజయవంతంగా జరిగింది.ఈ సభకు భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం, పల్లెల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు.పంగిడిపల్లి గ్రామానికి అవసరమైన అంతర్గత రహదారులు, మురుగు కాలువలు, మహిళా సమాఖ్య సంఘ భవనాల నిర్మాణం వంటి మౌలిక వసతుల కల్పనకు స్థానిక అవసరాలకు అనుగుణంగా తగిన నిధులు మంజూరు చేసి త్వరితగతిన పనులు చేపడతామని హామీ ఇచ్చారు. పల్లెల్లో పారిశుధ్య నిర్వహణ, తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త రేషన్ కార్డులు,ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం (మహాలక్ష్మి పథకం) సహా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.వానాకాలం సాగు సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతాంగం వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. రైతులు సాంప్రదాయ పద్ధతులకు స్వస్తి పలికి, వ్యవసాయ అధికారుల సూచనల మేరకు శాస్త్రీయ పద్ధతుల్లో పంటల సాగు చేపట్టాలన్నారు. విపరీతంగా రసాయన ఎరువులు వాడి భూములను పాడుచేసుకోకుండా, భూసారాన్ని కాపాడుకునేందుకు సేంద్రియ ఎరువుల వినియోగాన్ని పెంచడం ద్వారా నేల సారవంతతను మెరుగుపరుచుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం సబ్సిడీ విత్తనాలు, ఎరువులు మరియు సాంకేతిక సహాయ సహకారాలను అందిస్తూ రైతులకు ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.ఇదే వేదికపై రోడ్డు భద్రత అంశాల గురించి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రత్యేకంగా ప్రస్తావించారు. గ్రామీణ ప్రాంతాల్లో వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని, ప్రాణ రక్షణ కోసం ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని, ప్రతి వాహనదారుడు చట్టబద్ధంగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని స్పష్టం చేశారు. ఈ మహా గ్రామసభలో టేకుమట్ల మండల ప్రత్యేక అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రెవెన్యూ, వ్యవసాయ, మున్సిపల్ శాఖల అధికారులు, మండల కాంగ్రెస్ నాయకులు, పెద్ద సంఖ్యలో రైతులు పంగిడిపల్లి గ్రామ ప్రజలు పాల్గొన్నారు.