విద్యాహక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఉచిత, నిర్బంధ విద్యాహక్కు చట్టం (ఆర్టిఈ-2009) నిబంధనలను తుంగలో తొక్కుతూ, నిరుపేద విద్యార్థులకు అన్యాయం చేస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలపై విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్ఐ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి భూక్యా నవీన్ డిమాండ్ చేశారు. స్థానిక పాత్రికేయుల సమావేశంలో ఆయన ముఖ్య వక్తగా హాజరై మాట్లాడారు.ప్రస్తుతం సమాజంలో విద్యను ఒక పవిత్రమైన సేవగా కాకుండా లాభాపేక్షతో కూడిన పక్కా వ్యాపారంగా మార్చేస్తున్నారని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నూతన విద్యా సంవత్సరం అడ్మిషన్ల పేరుతో ప్రైవేట్ పాఠశాలలు తల్లిదండ్రుల నుండి డొనేషన్లు, ఫీజుల రూపంలో భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నాయని, ఇది విద్యాహక్కు చట్టం మూల ఉద్దేశాలకే విరుద్ధమని మండిపడ్డారు. కొన్ని విద్యాసంస్థలు మరింతగా తెగబడి, విద్యార్థులకు అవసరమైన నోటుబుక్స్, పాఠ్యపుస్తకాలు, బెల్టులు, టైలు మరియు స్టేషనరీ వస్తువులను బయట మార్కెట్ లోని దుకాణాలలో కొనుగోలు చేసే కనీస అవకాశం కూడా ఇవ్వకుండా, పాఠశాలల ప్రాంగణాల్లోనే స్వయంగా విక్రయిస్తూ అక్రమ సంపాదనకు తెరలేపాయని ఆరోపించారు. దీనివల్ల ఒక్కో విద్యార్థిపై తల్లిదండ్రులు అదనంగా రూ. 2000 నుండి రూ. 4000 వరకు ఆర్థిక భారం మోయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్రంలో అసలు విద్యాహక్కు చట్టం అమలు ఎక్కడైనా ఉందా అని ఆయన విద్యాశాఖ అధికారులను నిలదీశారు. చట్టం ప్రకారం అన్ని కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల్లో ప్రాథమిక దశ ప్రవేశాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనారిటీ వర్గాలకు చెందిన నిరుపేద పిల్లల కోసం 25 శాతం సీట్లను ఉచితంగా కేటాయించాల్సిన చట్టబద్ధమైన బాధ్యత యాజమాన్యాలపై ఉన్నప్పటికీ, జిల్లాలో ఎక్కడా ఇది అమలు కావడం లేదని ధ్వజమెత్తారు. భారత రాజ్యాంగం ప్రకారం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన విద్యాహక్కు చట్టం–2009 ఎప్పుడో అమల్లోకి వచ్చినప్పటికీ, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు దాన్ని పూర్తిస్థాయిలో క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంలో పాలకులు విఫలమయ్యారని పేర్కొన్నారు. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారులు నిద్రమత్తు వీడి, అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో ఈ 25 శాతం ఉచిత రిజర్వేషన్ సీట్ల కేటాయింపు ప్రక్రియపై నిరంతరం ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని, నిబంధనలు పాటించని స్కూళ్ల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, ఆర్టీఈ చట్టం-2009 నిబంధనల ప్రకారం అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులకు సరిపడా తరగతి గదులు, సురక్షితమైన తాగునీరు, బాలబాలికలకు ప్రత్యేక మరుగుదొడ్లు, ఆటస్థలం, ప్రమాదాల నివారణకు అగ్నిమాపక పరికరాలు (ఫైర్ యాక్టింగ్విషర్స్), అత్యవసర ప్రథమ చికిత్స పెట్టె (ఫస్ట్ ఎయిడ్ కిట్) వంటి కనీస మౌలిక వసతులు ఉండేలా యాజమాన్యాలపై ఒత్తిడి తీసుకురావాలని నవీన్ కోరారు. ఈ సమావేశంలో డీవైఎఫ్ఐ జిల్లా,మండల ముఖ్య నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.