గుడ్ మార్నింగ్ స్కూల్ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి
స్థానిక గుడ్ మార్నింగ్ స్కూల్లో విద్యార్థి సంఘ మహిళా నాయకురాళ్లపై పాఠశాల యాజమాన్యం అమానుషంగా ప్రవర్తించిన తీరుకు నిరసనగా గురువారం మహాదేవపూర్ మండల కేంద్రంలో తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఐసా) జిల్లా అధ్యక్షురాలు బి. సుజాత ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నిరసన ధర్నా చేపట్టారు. ఈ ఆందోళన కార్యక్రమానికి సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్, ఐసా జిల్లా అధ్యక్షురాలు బి. స్వాతి సంపూర్ణ మద్దతు ప్రకటించి ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమాజానికి ఆదర్శంగా ఉంటూ విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన విద్యాసంస్థల నిర్వాహకులే, కనీసం మహిళలనే గౌరవం లేకుండా అమానుషంగా మాట్లాడటం,విచక్షణారహితంగా ప్రవర్తించడం అత్యంత బాధాకరమని, సమాజం తలదించుకునే విషయమని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ పాఠశాలల్లో సాగుతున్న విద్యా వ్యాపారాన్ని అరికట్టాలని గత కొన్ని రోజులుగా ఐసా విద్యా సంఘం ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి పరిశీలన చేస్తున్నట్లు వారు తెలిపారు.ఇందులో భాగంగానే మహాదేవపూర్ మండల కేంద్రంలోని గుడ్ మార్నింగ్ స్కూల్ ఆవరణలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న బుక్ స్టాల్ను తాము సందర్శించామని, అక్కడ అక్రమంగా పుస్తకాల విక్రయాలు జరుగుతున్న విషయం స్పష్టమైందని వివరించారు. ఈ అక్రమ విక్రయాలపై విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేయడమే తాము చేసిన నేరమన్నట్లుగా,పాఠశాల యాజమాన్యం విద్యార్థి సంఘాల పట్ల, ముఖ్యంగా మహిళా నాయకురాళ్ల పట్ల దుర్మార్గుల్లా ప్రవర్తించారని మండిపడ్డారు. ప్రైవేట్ విద్యాసంస్థల అక్రమాలను ప్రశ్నిస్తే భౌతిక దాడులకు, దూషణలకు దిగడం వారి అహంకారానికి నిదర్శనమన్నారు.ఈ సందర్భంగా వారు విద్యాశాఖ, పోలీస్ ఉన్నతాధికారుల ముందు పలు డిమాండ్లను ఉంచారు.నిబంధనలు ఉల్లంఘించిన గుడ్ మార్నింగ్ స్కూల్ వ్యవహారంపై విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి సమగ్ర విచారణ జరిపి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే మహిళా ప్రతినిధులను కనీస గౌరవం లేకుండా దూషించిన స్కూల్ యాజమాన్యంపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలన్నారు. పాఠశాల పరిధిలో అధికారులు సీజ్ చేసిన అక్రమ బుక్ స్టాల్కు సంబంధించిన ‘పంచనామా రిపోర్టు’ను మండల విద్యాధికారి తక్షణమే మీడియా ముఖంగా బహిర్గతం చేయాలని,లేనిపక్షంలో విద్యాశాఖ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు.ఈ నిరసన కార్యక్రమంలో ఐసా విద్యార్థి సంఘం నాయకులు, ప్రజాపంథా ప్రతినిధులు, స్థానిక యువకులు,విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని పాఠశాల యాజమాన్యానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు.