బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ లక్కీ డ్రా పూర్తి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్’ కింద విద్యార్థుల ఎంపికకు సంబంధించిన లక్కీ డ్రా కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించబడింది. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం లో గల ప్రధాన సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఈ అధికారిక కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) విజయలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై,అధికారుల సమక్షంలో లక్కీ డ్రా ప్రక్రియను స్వయంగా ప్రారంభించి నిర్వహించారు.జిల్లాలోని ఎంపిక చేసిన నాలుగు ప్రముఖ ప్రైవేట్ పాఠశాలల్లో ఒకటో తరగతి మరియు ఐదో తరగతిలో ప్రవేశాల కోసం ఈ లక్కీ డ్రాను చేపట్టారు. మొత్తం 84 సీట్ల భర్తీ కోసం నిర్వహించిన ఈ ప్రక్రియలో.. 1వ తరగతికి కేటాయించిన 41 సీట్లకు, అలాగే 5వ తరగతికి కేటాయించిన 43 సీట్లకు లక్కీ డ్రా ద్వారా విద్యార్థులను ఎంపిక చేశారు.ఈ విద్యా సంవత్సరానికి గానూ జిల్లా వ్యాప్తంగా ఈ పథకం కింద ప్రవేశాల కోసం మొత్తం 141 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, అధికారులు దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించారు. అందులో అన్ని రకాల అర్హతలు కలిగిన 135 మంది విద్యార్థుల పేర్లను తుది జాబితాలో చేర్చి, వారి సమక్షంలోనే లక్కీ డ్రాను నిర్వహించారు. ఈ డ్రా ద్వారా మొత్తం 84 మంది లబ్ధిదారులైన విద్యార్థులు ఉత్తమ ప్రైవేట్ పాఠశాలల్లో ఉచితంగా నాణ్యమైన విద్యను అభ్యసించేందుకు సీట్లను సాధించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. ఎలాంటి అవకతవకలకు తావులేకుండా, విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలోనే అత్యంత పారదర్శకంగా, లక్కీ డ్రా పద్ధతిలో సీట్ల భర్తీ ప్రక్రియను పూర్తి చేసినట్లు వెల్లడించారు. ఉచిత విద్యావకాశాన్ని పొందిన విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ, ఎంపికైన విద్యార్థుల తల్లిదండ్రులకు ఆమె ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ ఉన్నతమైన కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి సుకీర్తి జై భీం, జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్,రెసిడెన్షియల్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు బిక్షపతి,వివిధ విభాగాల సంబంధిత అధికారులు,ఎంపికైన విద్యార్థులు వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.