చదువుకు చేయూతగా 400 మంది విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు
విద్యార్థుల విద్యాభ్యాసానికి ప్రోత్సాహం అందించే లక్ష్యంతో ఖమ్మంజిల్లా ఆర్యవైశ్య మహాసభ శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి చిరు వ్యాపారస్తుల సంఘం ఆధ్వర్యంలో 400 మంది పేద విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. ఆదివారం రాత్రి సంఘం అధ్యక్షుడు మిట్టపల్లి రవి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సేవా కార్యక్రమంలో విద్యార్థులకు విద్యా సామగ్రిని అందజేశారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు పసుమర్తి సీతా చందర్‌రావు మాట్లాడుతూ, మిట్టపల్లి రవి సమాజ సేవలో ముందుంటూ మహిళలకు స్వయం ఉపాధి కోసం కుట్టుమిషన్లు, గ్రైండర్లు పంపిణీ చేయడంతో పాటు పేదలకు నిత్యావసర వస్తువులు అందిస్తున్నారని కొనియాడారు. భద్రాద్రి బ్యాంకు ద్వారా మహిళలు, చిరు వ్యాపారులకు రుణాలు ఇప్పించడంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు.
సంఘం అధ్యక్షుడు మిట్టపల్లి రవి మాట్లాడుతూ ప్రతి ఏడాది విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నులు, వాటర్ బాటిల్స్ పంపిణీ చేస్తున్నామని తెలిపారు. భారీ వర్షం కురిసినా విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరుకావడం తమ సేవా కార్యక్రమాలకు లభిస్తున్న ఆదరణకు నిదర్శనమన్నారు. భవిష్యత్తులో కూడా విద్యార్థుల సంక్షేమం కోసం ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తామని వెల్లడించారు.
ఈ కార్యక్రమానికి సిరి చైతన్య కళాశాల ప్రిన్సిపాల్ గుంటూరు సోమయ్య, చాంబర్ ఆఫ్ కామర్స్ దిగుమతి శాఖ ప్రధాన కార్యదర్శి ఎర్ర అప్పారావు, డివిజన్ నాయకులు అద్దంకి శివ, నారపోగు వెంకటేష్, ప్రముఖ హైస్కూల్ హెడ్‌మాస్టర్ రమణమ్మ తదితరులు హాజరయ్యారు.
పలువురు దాతలు నోట్‌బుక్స్, పెన్నులు అందించి కార్యక్రమానికి సహకరించారు. సంఘం కార్యవర్గ సభ్యులు, మహిళా కమిటీ సభ్యులు, సంఘ సభ్యులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమ విజయవంతానికి సహకరించిన దాతలు, సభ్యులకు సంఘం అధ్యక్షుడు మిట్టపల్లి రవి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.