పదో తరగతి ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్యవైశ్య మహాసభ ఘన సన్మానం
ఖమ్మంజిల్లా ఆర్యవైశ్య మహాసభ విద్యా కమిటీ ఆధ్వర్యంలో పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన ఆర్యవైశ్య విద్యార్థులకు ఆదివారం రాత్రి ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఖమ్మంలోని మమతా కాలేజీ రోడ్డులో ఉన్న పసుమర్తి ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ మండలాల నుంచి అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా సత్కరించి జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందజేశారు.
విద్యా కమిటీ చైర్మన్ రాయల నాగేశ్వరరావు అధ్యక్షతన, ప్రధాన కార్యదర్శి పెనుగొండ ఉపేంద్రరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు పసుమర్తి సీతా చందర్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా ప్రధాన కార్యదర్శి గోళ్ళ రాధాకృష్ణమూర్తి, ముఖ్య సమన్వయకర్త చారుగుండ్ల నరసింహమూర్తి, విశిష్ట ఫౌండేషన్ ప్రతినిధి గుర్రం సీత, స్టెమ్స్ పార్క్ జూనియర్ కాలేజ్ అధినేత కొండా శ్రీధర్, పసుమర్తి ఫంక్షన్ హాల్ అధినేత పసుమర్తి రామచంద్రరావు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ విద్యార్థులు సాధించిన విజయం కుటుంబానికే కాకుండా సమాజానికీ గర్వకారణమని పేర్కొన్నారు. కష్టపడి చదివితే జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించవచ్చని, విద్యార్థులు లక్ష్యసాధనలో నిరంతరం శ్రమించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు విద్యా కమిటీ చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని కొనియాడారు.
కార్యక్రమ నిర్వహణలో ఉపాధ్యక్షులు వేమిశెట్టి మోహన్ దాస్, కార్యదర్శులు మందడపు శ్రీనివాసరావు, వెచ్చా రామకృష్ణ, దాచేపల్లి రామకృష్ణతో పాటు కమిటీ సభ్యులు విశేషంగా కృషి చేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఆర్యవైశ్య నాయకులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సన్మానం పొందిన విద్యార్థులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, ఇలాంటి ప్రోత్సాహం మరింత ఉన్నత లక్ష్యాల వైపు ముందుకు సాగేందుకు స్ఫూర్తినిస్తుందని తెలిపారు.
Good coverage medam garu namaste.