
- ఎరవెల్లి జగన్ డా. బి. ఆర్. అంబేద్కర్ ప్రతిభ పురస్కార్ అవార్డ్ గ్రహిత.
ఇటీవల Human Development Index-2022 విడుదల చేసిన 193 దేశాల మానవాభివృద్ధి సూచిలో మన భారత దేశం 134వ స్థానంలో ఉండడం శోచనీయం.
ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ఆ దేశంలోని మానవ వనరులను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి ప్రపంచంలో ఎక్కువ యువత భారతదేశంలోనే ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. వారి నైపుణ్యాలకు సరైన అవకాశాలు కల్పించడం ఆయా దేశ ప్రభుత్వాల కనీస బాధ్యత. యువతకు నైపుణ్యాలు పెంచి అవకాశాలు కల్పించాలని భారత రాజ్యాంగంలో పొందుపరిచినగానీ, దాన్ని అమలు పరచడంలో మన ప్రభుత్వాలు వెనుకబడి పోతున్నాయి. అంతటి మహత్తర రాజ్యాంగాన్ని అందించిన రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్ అంబేద్కర్.
ప్రపంచమేధావిగా డా.బి.ఆర్ అంబేద్కర్ ను ఐక్యరాజ్య సమితి గుర్తించిన నేపథ్యంలో, తన జీవితమే తన సందేశంగా అంబెడ్కర్ చూపడం, తను జీవితంలో పడ్డ కష్టాలు, తన జాతి ప్రజలు పడకూడదనే విషయాన్ని తెలియజేస్తున్నాయి.
భీమ్ రావ్ రాం జి అంబేద్కర్ పుట్టినప్పటినుండి అగ్ర కులాల చేతిలో ఎన్నో అవమానాలు పడ్డా, జీవితంలో ఎదురైన సవాళ్ళను అధిగమించాడు. బరోడా మహారాజు సహాయంతో, కొలంబియా, లండన్ యూనివర్సిటీలలో ఎన్నో ఉన్నత చదువులు చదివి యావత్ ప్రపంచంలోనే అణగారిన వర్గాలకు ఆదర్శంగా నిలిచాడు. మహారాష్ట్ర లోని మహాద్ చెరువులో అంటరాని కులాలు నీళ్లు తాగరాదనే అగ్రవర్ణ ఆంక్షలకు వ్యతిరేకంగా 1927 లో మహాద్ చెరువు పోరాటానికి నాయకత్వం వహించి, ఆ వర్గాల్లో ఆత్మస్థైర్యాన్ని నింపారు. దేశంలో సామాజిక సమానత్వం లేని కారణంగా, భౌతికంగా పూడ్చలేని కులాల మధ్య అంతరాలను, భావపరంగా విప్లవం రావాలని, మనిషిని ప్రేమించే స్వభావం కలిగి, ప్రతిభను ఆహ్వానించే విశాల హృదయం కావాలని ఆకాంక్షించారు. భారతీయులందరు జ్ఞానవంతులుగా, నూతన ప్రపంచాన్ని అవిష్కరించగలిగే ప్రతిభావంతులుగా ఉండాలని,
ప్రపంచంలోనే అతిపెద్ద లిఖితపూర్వక రాజ్యాంగాన్ని రాశారు. ఇది కౌటిల్యుని అర్దశస్త్రానికి, మనుస్మృతి, పరాశర స్మృతికి ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు. ఎవరి నుండి ఈ స్వేచ్ఛ, స్వాతంత్య్రం వచ్చిందో ఆయననే నిరాకరిస్తున్న దేశం మనది. అలాంటి గొప్ప రాజ్యాంగం ఇప్పటివరకు సుమారు 104 సార్లు రాజ్యాంగం సవరించబడి, 444 ఆర్టికల్లు, 12 షెడ్యూళ్లు, 26 భాగలతో, దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించి, దేశంలో సమసమాజ నిర్మాణం ఏర్పడాలని కలలు గన్న డా.బి.ఆర్ అంబేద్కర్ కలలు కలలుగానే మిగిలిపోయాయి. దేశంలో ఏ ప్రభుత్వం ఏర్పడ్డా, రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కి, రాజ్యాంగంలో గల అవకాశాలను అలుసుగా చేసుకొని, వాటిని వివిధ రాజకీయ పార్టీలు వారి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే ఉపయోగించుకున్నారు తప్ప, ప్రజా ప్రయోజనాల కోసం ఏమాత్రం పట్టించుకోలేదు. అందుకే భారతదేశానికి స్వాతంత్యం వచ్చి 78 సంవత్సరాలు వచ్చినా, దేశంలో ఇంకా అసమానతలు, అవిద్య, అంటరానితనం, అక్రమాలు, అన్యాయాలు, అత్యాచారాలు, కొనసాగుతూనే ఉన్నాయి. దేశంలో ఉన్న ప్రతి భారతీయునికి కూడు, గూడు, గుడ్డ ఉండాలని, సామాజిక వెనుకబాటుకు గురి అయిన ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు విద్యలో, ఉద్యోగంలో, రాజకీయాలలో, ఆర్థిక, వ్యాపార రంగాలలో ఎదగాలని రిజర్వేషన్లు కల్పించి ఆ జాతులు ఉన్నతంగా ఎదగాలని కాంక్షించారు. కానీ, నేటి బహుజనులు పరిస్థితి అగమ్యగోచరంగా తయారయింది.
ఆర్టికల్ 15లో మత, జాతి, కుల లింగ భేదం లేకుండా, జన్మ స్దాన కారణాలను బట్టి వివక్ష చూపడం నేరం అని చెప్పడం జరిగింది. ఆర్టికల్ 17 ప్రకారం అస్పృశ్యత, అంటరానితనం రద్దు చేయబడింది. అయిన ఇప్పటికీ ఉత్తరప్రదేశ్, బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్ లాంటి కొన్ని రాష్ట్రాల్లో వెనుకబడిన జాతులపై అనేక దుశ్చర్యలకు పాల్పడుతున్నారు.
ఇప్పటికి గ్రామీణ భారతదేశంలో అక్షరాస్యత 60 శాతానికి మించలేదు. సగటు భారతీయుని తలసరి ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. భారతదేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రతరం అయింది. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వ ఏర్పాటు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు బడా పెట్టుబడిదారులకు ఆదాయ మార్గాలుగా మారిపోయాయి.
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కొంతమంది బి.జె.పి నాయకులు, రిజర్వేషన్ల పై సమీక్ష చేయాలనుకోవడమే కాకుండా రాజ్యాంగాన్ని మార్చాలి అనుకోవడం దురదృష్టకరం. దీన్ని బహుజన నాయకులు వ్యతిరేకించడంతో కాస్త వెనక్కి తగ్గారు. కానీ ఆయా రాష్ట్రాల్లో మతపరమైన దాడులు చేస్తూ భారతదేశంలో లౌకికత్వానికి తూట్లు పొడుస్తున్నాయి.
డా.బి.ఆర్ అంబేద్కర్ ఈ దేశంలో సామాజిక పరివర్తన ద్వారా ఆచరణాత్మక ప్రజాస్వామ్యం నిర్మించడం సాధ్యమని గట్టిగా విశ్వసించారు. విద్యా వ్యాప్తి, విప్లవాత్మక భూ సంస్కరణలు, ఆర్థిక సమానత్వం, సార్వత్రిక వయోజన ఓటు ద్వారా రాజకీయాధికారం తద్వారా సామాజిక మార్పు సాధ్యం అని భావించారు.
మానవ హక్కుల పరిరక్షకునిగా, మానవతా మూర్తిగా, బహుజనులు విముక్తి ప్రదాతగా, సర్వ జన హితునిగా, సమస్త సమస్యల పరిష్కారానికి రాజ్యాధికారమే ముఖ్యమని తేల్చి చెప్పారు.
కానీ, కులాల మధ్య కుమ్ములాటలు, మతాల మధ్య రాజకీయ నాయకుల చిచ్చు, వెరసి బహుజనుల మధ్య అనైక్యతనే వారిని రాజకీయాధికారానికి దూరం చేస్తున్నాయి. మనిషిని మనిషిగా చూడడమే మానవత్వం అని అంబేద్కర్ అన్నారు. అలా కాకుండా సాటి మనుషులను హీనంగా చూస్తూ, పక్షులను, జంతువులను ప్రేమించే విచిత్రమైన సంస్కృతి భారతదేశంలో పెరుగుతుందని,
ఇది ఇలాగే కొనసాగితే మానవ సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం లేకపోలేదని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు
ఇప్పటికి అంబేద్కర్ ను అర్థం చేసుకోవాలంటే తను రాసిన రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవాలి. అది ఇంకా భారతీయుల మనసులలోకి, మెదళ్లలోకి చేరలేదు. అది కేవలం కొంతమంది చేతుల్లో ఆభరణంగానే ఉంది. దీని ప్రతిఫలాల కోసం సామాజిక, సాంస్కృతిక, రాజకీయ ఉద్యమం జరగాలి. అందుకు విద్యావంతులు, మేధావులు, ఉద్యోగస్తులు, రచయితలు భాగస్వామ్యం కావడమే బాబాసాహెబ్ కు మనమిచ్చే నిజమైన నివాళి.
- ఎరవెల్లి జగన్
డా. బి. ఆర్. అంబేద్కర్ ప్రతిభ పురస్కార్ అవార్డ్ గ్రహిత.
JNTUH యూనివర్సిటీ హైదరాబాద్.
( రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్.అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా)