
వడగండ్ల వానలతో నష్టపోయిన రైతులకు రూ.50,వేలు నష్టపరిహారం ఇవ్వాలి
పంటల భీమా వెంటనే అమలు చేయాలి–తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా చందు నాయక్ డిమాండ్
ఈ69న్యూస్ జనగామ
గత వారం రోజులుగా జనగామ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలు,వడగండ్ల వానల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని,వారికి తగిన నష్టపరిహారం అందించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా చందు నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.వరి పంటకు ప్రతి ఎకరాకు రూ.50,000,ఉద్యానవన పంటలకు(కూరగాయలు,మామిడి తోటలు తదితర) రూ.1,50,000 నష్టపరిహారం ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు.తెలంగాణ రైతు సంఘం జిల్లా సమావేశం జిల్లాధ్యక్షులు రాపర్తి సోమయ్య అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా భూక్యా చందు నాయక్ మాట్లాడుతూ..ప్రస్తుతం ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం చాలా తక్కువగా ఉంది.ప్రతి ఎకరాకు కేవలం రూ.10,000 మాత్రమే ఇవ్వడం అన్యాయమని,రైతులు పెట్టుబడిగా కనీసం రూ.40,000 ఖర్చు పెడుతున్నారని,నష్టపరిహారాన్ని పెంచాలని డిమాండ్ చేశారు.అలాగే రాష్ట్ర ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చిన పంటల భీమా పథకం ఇప్పటికీ అమలు చేయలేదని విమర్శించారు.ఈ పథకాన్ని చట్టబద్ధంగా రూపొందించి,రైతులను ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్ బీమా యోజనను రైతులకు మరింత అనుకూలంగా మార్చాలని,రైతులకు నష్టపరిహారం లభించేలా చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు.ఈ సమావేశంలో మాచర్ల సారయ్య,మంగ బీరయ్య,రమావత్ మీట్యా నాయక్,ఎడబోయిన రవీందర్ రెడ్డి,నక్క యాకయ్య,లింగబోయిన కుమారస్వామి,సమ్మయ్య, ఉర్సుల కుమార్ తదితరులు పాల్గొన్నారు.