
ఈ69న్యూస్ జనగామ
జిల్లాలోని నిరుపేదలు, రైతులు ఆర్థికంగా ఎదగడానికి సహకార సంఘాలు కీలక పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ పేర్కొన్నారు. గురువారం ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన జిల్లా సహకార అభివృద్ధి కమిటీ సమావేశంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామస్థాయిలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, రైతు సేవా సంఘాలు,పాల ఉత్పత్తి సంఘాలు,మత్స్య సహకార సంఘాలు,కల్లు గీతకార్మిక సంఘాలు వంటి అనేక విభాగాల్లో విస్తృతంగా సేవలు అందించాల్సిన అవసరం ఉందని అన్నారు.గ్రామీణ ప్రజలకు మరింత సేవలు అందించాలంటే కొత్త సహకార సంఘాల ఏర్పాటును ప్రోత్సహించాలని సూచించారు.రైతు ఉత్పత్తి కేంద్రాలను పీవీఎస్ఎస్ పరిధిలో ఏర్పాటు చేయాలనే అంశాన్ని అధికారులతో సమీక్షించారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.సహకార సంఘాలు తమ వ్యాపార పరిధిని విస్తరించుకొని స్వయం సమృద్ధి సాధించాలి.అలా చేస్తే రైతులకు, గ్రామీణ ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చని కలెక్టర్ అభిప్రాయపడ్డారు.మత్స్య,పాల ఉత్పత్తుల సంఘాలు కూడా తమ సేవా విస్తృతిని పెంచుకోవాలని సూచించారు.ఈ సమావేశంలో జడ్పీ డిప్యూటీ సీఈవో సరిత,జిల్లా సహకార శాఖ అధికారి రాజేందర్ రెడ్డి,వ్యవసాయ అధికారి రామారావు నాయక్,మత్స్యశాఖ అధికారి రాణా ప్రతాప్,పశుసంవర్ధక శాఖ అధికారి రాధా కిషన్,నాబార్డ్ ఏజీఎం చంద్రశేఖర్, విజయడైరీ అధికారి సత్యనారాయణ,డిసిసిబి అధికారి అశోక్,సహకార శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.