
కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ కార్పొరేటీకరణను వెంటనే విరమించాలి
జనగామ ఈ69న్యూస్
వ్యవసాయ రంగాన్ని ప్రైవేటు కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి అప్పగించేందుకు మోడీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తక్షణమే నిలిపివేయాలని,రైతుల వ్యతిరేక చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి భూక్యా చందు నాయక్,రాష్ట్ర కమిటీ సభ్యుడు మోకు కనకరెడ్డి డిమాండ్ చేశారు.జనగామ జిల్లా కేంద్రంలోని ప్రజాసంఘాల కార్యాలయంలో అఖిల భారత రైతు సంఘం 89వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జండా ఆవిష్కరించారు.అనంతరం మాట్లాడిన వారు,రైతుల హక్కుల కోసం 1936లో ఏర్పడిన ఈ సంఘం భూ సంస్కరణలు,రాజరిక వ్యవస్థలు రద్దు చేయించడంలో కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు.ప్రస్తుతం పాలనలో ఉన్న కేంద్ర ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని పెంచుతామని చెప్పి అధికారంలోకి వచ్చినప్పటికీ,వాస్తవంలో నల్ల చట్టాల ద్వారా వ్యవసాయాన్ని సంపన్నుల చేతుల్లోకి అప్పగించేందుకు ప్రయత్నించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.దేశవ్యాప్తంగా రైతుల తీవ్ర పోరాటాలతో ఆ చట్టాలను వెనక్కి తీసుకున్నా,వాటికి భరోసా ఇచ్చిన హామీలను ఇప్పటికీ అమలు చేయలేదని తెలిపారు.రైతుల కోసం డిమాండ్లు:-పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధ హామీ ఇవ్వాలి,రైతుల అప్పులను పూర్తిగా మాఫీ చేయాలి,విద్యుత్ చట్ట సవరణను రద్దు చేయాలి,ప్రైవేటు మార్కెట్ విధానాలను నిలిపేయాలి,రైతులకు ఇచ్చే పెట్టుబడి సహాయాన్ని పెంచాలి,పంటల బీమా పథకాన్ని రైతులకు అనుకూలంగా మార్చాలి,అలాగే,రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని,రుణ మాఫీ,రైతుబంధు వంటి పథకాలు పూర్తిస్థాయిలో అమలుకాలేదని విమర్శించారు.భూభారతి చట్టం కేవలం మాటలకే పరిమితమైందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బూడిద గోపి,దాసగాని సుమ,యాకన్న రాథోడ్,మంగ బీరయ్య,కర్రే సత్తయ్య,బూడిద అంజమ్మ,మచ్చ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.