
సమాజ చీలికకు ప్రోత్సాహం ఇవ్వకుండా, దేశ సమైక్యతను ప్రోత్సహించాలి
హైదరాబాద్, ఈ69న్యూస్:
మీడియా ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా, దేశ సమైక్యతను బలపరిచేలా వార్తలు ఇవ్వాలని భారత గౌరవ పూర్వ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు సూచించారు. వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు గురువారం ఆయనను జూబ్లీహిల్స్ లోని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, సంచలనాలకు లోనవకుండా వాస్తవాలను ప్రసారం చేయాలని మీడియాకు సూచించారు.సమాజాన్ని చీల్చే కుల,మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిని మీడియా ప్రోత్సహించకూడదన్నారు. “జర్నలిజం అంటే నిజం చెప్పడమే,ఏ ఇజం కాదు” అన్నారు.జమిలి ఎన్నికల ప్రతిపాదన ప్రజలకు మేలు చేసే అంశమని అభిప్రాయపడ్డ ఆయన, ప్రజలు కేంద్రానికి, రాష్ట్రానికి విడివిడిగా ఓటు వేయగల సత్తా ఉన్నవారన్నారు. మాతృభాషలో విద్య బోధనకు ప్రాధాన్యం పెంచాలని సూచించారు.వక్ఫ్ సవరణ చట్టం ధర్మకార్యాలకు న్యాయం చేయడం కోసమేనని,మావోయిస్టులు ఆయుధాలు వదిలి రాజ్యాంగబద్ధంగా ఎన్నికల ద్వారా ప్రజల మద్దతు కోరాలన్నారు.రాజకీయ నాయకులు హుందా భాష ఉపయోగించాలని,అభ్యంతరకర వ్యాఖ్యలకు ప్రజలే సమాధానం చెప్తారని వ్యాఖ్యానించారు.